Pawan-Kalyan - YS-Jaganజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈమధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అని సంబోధిస్తున్నారు. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు, ఆ పార్టీ అభిమానులకు అసలు నచ్చడం లేదు. ఆ పార్టీ నేతలైతే పవన్ కళ్యాణ్ ని పవన్ నాయుడు అని సంబోధించడం మొదలు పెట్టారు. ఈ విషయంగా పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

జగన్ రెడ్డి సీఎంలా మాట్లాడితే తాను ముఖ్యమంత్రి అని పిలుస్తానని, ఆయన కొందరి సీఎ లా ప్రవర్తిస్తే పేరు పెట్టి పిలుస్తానని ఆయన అంటున్నారు. ప్రత్యేక హోదాపై ప్రధానిని అడిగే ధైర్యం వైఎస్సార్ కాంగ్రెస్ కు ఉందా అని ఆయన అన్నారు. రైతు సమస్యలపై ప్రధానికి లేఖ రాస్తానని ఆయన చెప్పారు. భారతీ సిమెంట్ పరిశ్రమపై ఉన్న శ్రద్ద కడప స్టీల్ ప్లాంట్ పై లేదని ఆయన ఆరోపించారు.

పవన్ కళ్యాణ్ తన ఆరు రోజుల రాయలసీమ యాత్రను ఈరోజు నుండి మొదలు పెట్టారు. మొట్టమొదటిగా సీఎం సొంతజిల్లా కడపలో పర్యటించడం విశేషం. అలాగే జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో కూడా పర్యటిస్తారని సమాచారం. ఆ తరువాత చిత్తూరు జిల్లాకు వెళ్తారు. కడప జిల్లా కోడూరు లో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాయలసీమ ఫ్యాక్షన్ సీమ కాదని, చదువుల తల్లి సీమని అని ఆయన అన్నారు. అలాగే ఇటీవలే ఎన్నికల ఫలితాలపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆశయం కోసం పనిచేసేవారికి గెలుపు ఓటములతో సంబంధం లేదని ఆయన అన్నారు. ఇటీవలే జరిగిన ఎన్నికలలో జనసేనకు ఒక్క సీటు మాత్రమే వచ్చిన సంగతి తెలిసిందే.