లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను పక్కనపెట్టి, రోడ్డు పైకి రావడం తనకు ఎంతగానో బాధ కలిగించిందంటూ ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘ఛలో విజయవాడ’ ఉదంతంపై స్పందించిన పవన్, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేసారు.
అధికారంలోకి రావడానికి ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత అవగాహన లేకుండా చెప్పేసామని చెప్పడం సరికాదంటూ వైసీపీ సర్కార్ కు హితవు పలికారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీతాలు పెంచుతామని చెప్పి, ఇప్పుడు తగ్గించడం సమంజసం కాదని అన్నారు.
నిజానికి ఈ అంశంపై ముందే మాట్లాడదామని అనుకుంటే, వేరే రాజకీయ పార్టీలను ఇందులో భాగస్వామ్యులు చేయదలచుకోలేదని, వారి సహకారం మాకు అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఉద్యోగ సంఘ నేతలు చెప్పారని అన్నారు.
ఉద్యోగులు అడిగిన రోజున ఖచ్చితంగా వారికి మద్దతుగా జనసేన పార్టీ నిలుస్తుందని హామీ ఇచ్చారు. లక్షలాది మంది టీచర్లు బయటకు వచ్చి ఎండలో నిరసన కార్యక్రమాలు తెలియజేయడం తనకు బాధ కలిగించిందని అన్న పవన్, తనకున్న సమాచారం మేరకు 200 మందిని అరెస్ట్ చేశారని అన్నారు.
చాలామందిపై లాఠీ చార్జీలు చేయడం కూడా తనకు బాధ కలిగించిందని, చర్చలకు పిలిచి వారిని నిరీక్షించేలా చేసి అవమాన పాలు చేయడం వైసీపీ ప్రభుత్వానికి ఏ మాత్రం తగదని, ఇలాంటి కార్యక్రమాలను పక్కనపెట్టి సంబంధిత మంత్రులు స్పందించాలని కోరారు.
ఈ మూడేళ్లల్లో వైసీపీ నేతల ఆదాయం 3 రెట్లు పెరిగిందని ఆరోపణలు చేసిన పవన్, ఉద్యోగుల జీతాలు 30 శాతం తగ్గాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఉద్యోగులను కించపరిచే మాటలను ఆపి, మీరిచ్చిన మాటను మీరు నిలబెట్టుకోండి అంటూ వైసీపీ నేతలకు పిలుపునిచ్చారు.