Pawan Kalyan comments on KCR return gift to chandrababu naiduఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వేలు పెట్టి చంద్రబాబుని ఇంటికి సాగనంపాలి అని కేసీఆర్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందా అంటే పవన్ కళ్యాణ్ అవును అనే అంటున్నారు. “వైకాపా, తెరాస మధ్య డ్రాయింగ్‌ రూమ్‌లో జరిగిన పొత్తు చర్చలు ప్రజల మధ్యకొచ్చేశాయి. కేసీఆర్‌ చంద్రబాబుకు ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ ఇవ్వాలనుకుంటే ఆంధ్రాకొచ్చి పోటీ చెయ్యాలి. లేదా జగన్‌తో కలిసి పోటీ చెయ్యాలి. అది ప్రజాస్వామ్య పద్ధతి. ఆ హక్కు ఆయనకుంది, దాన్ని ఆయన వినియోగించుకుంటే స్వాగతిస్తా,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

“ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని నేను దగ్గరి నుంచి చూస్తున్నప్పుడు కేసీఆర్‌ ఇస్తానంటున్న రిటర్న్‌ గిఫ్ట్‌.. ఇప్పుడు చంద్రబాబుకు గిఫ్ట్‌గా మారుతోందని అనిపిస్తోంది,” అని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో కేటీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జగన్ ను కలిసినప్పుడు నిపుణులు అదే అభిప్రాయం వెళ్ళబుచ్చారు. కేసీఆర్ ఆ విషయాన్నీ ఆలస్యంగా తెలుసుకుని జగన్ తో తన భేటీని రద్దు చేసుకున్నారు. అప్పటి నుండి వైకాపా కోసం తెర వెనుక నుండే పని చేస్తున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

చంద్రబాబు ఆరోపిస్తునట్టుగా హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న నాయకులని కేసీఆర్ బెదిరిస్తున్నారని పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు. “కొన్ని నెలల కిందట కొంతమంది జనసేనలో చేరతామని చెప్పి.. తర్వాత వైకాపాలోకి వెళ్లారు. ఎందుకు.. అని ఆరా తీస్తే ‘మాకు హైదరాబాద్‌లో ఆస్తులున్నాయి, వాటితో సమస్యలున్నాయి’ అనేవారు. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు.. ఇప్పుడు తెలుస్తోంది”. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే అభిప్రాయం చెప్పడంతో చంద్రబాబు మాటకు మరింత బలం చేకూరుతుంది.