Pawan kalyan comments on Kapu schemeజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి కురుసాల కన్నబాబు విరుచుకుపడ్డారు. కుల ప్రస్తావన లేకుండా పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలు చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవలే తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాపు నేస్తం పథకంపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చెయ్యడంపై కన్నబాబు విమర్శలు చేశారు.

“కాపులకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అండగా నిలిచింది. కాపు నేస్తం పథకం కింద మహిళలకు ఆర్థిక సాయం చేశాం. ఏడాది కాలంలో కాపులకు రూ.4,769 కోట్లు ఆర్ధిక సాయం చేశాం. మంచి చేస్తున్న ప్రభుత్వంపై పవన్‌ కల్యాణ్‌కు ఎందుకంత ఉక్రోషం? ఓర్వలేనితనంతోనే అర్థంలేని విమర్శలు చేస్తున్నారు,” అంటూ విమర్శించారు.

“చంద్రబాబు పట్ల తన ప్రేమను పవన్‌ కళ్యాణ్‌ దాచుకోలేకపోతున్నారు. ముద్రగడ్డ పద్మనాభం, ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు సర్కార్‌ అవమానించినప్పుడు పవన్‌ కళ్యాణ్ ‌కు కళ్లు కనిపించలేదు. మేము కాపుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంటే ఓర్వలేకపోతున్నారు. జగన్ రెడ్డి జగన్ రెడ్డి అంటూ పదే పదే కుల ప్రస్తావన చేస్తున్నారు. పవన్ కి కులం కావాలేమో… జగన్ అందరివాడు,” అని అన్నారు.

“కాపులను మోసం చేసిన చంద్రబాబు నాయుడును పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు ప్రశ్నించలేదు? కాపు సామాజిక వర్గానికి ఎవరు మేలు చేశారో ఇప్పటికైనా పవన్‌ కళ్యాణ్‌ తెలుసుకోవాలి,” అంటూ సలహా ఇచ్చారు. పవన్ చేసేవి కుల రాజకీయాలు అయితే… కాపు కులస్తుడైన పవన్ కళ్యాణ్ ని కాపు మంత్రితోనే తిట్టించడం ఏం రాజకీయం అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.