Pawan Kalyan comments on caste based reservationsఇండియాలో కుల రిజర్వేషన్లపై జరిగే రగడ మరే ఇతర అంశంలో జరగదని చెప్పడంలో సందేహం లేదు. రాజకీయాలలో ఎంత రచ్చ జరిగినప్పటికీ, విద్యార్ధులలో మాత్రం తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోందన్నది మాత్రం వాస్తవం. అగ్ర కులం విద్యార్ధికి 80 మార్కులు వచ్చినా రాని సీటు, వెనుకబడిన కులం వారికి 50 మార్కులు వస్తే వచ్చేయడం… వారి ఆవేదనకు ఆర్ధం పడుతోంది. ఇది నేడు వ్యక్తమైన భావన కాదు. దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా విధ్యార్ధులను పట్టిపీడిస్తున్న సమస్యగా మారింది.

చాలా సున్నితత్వంతో కూడిన సమస్య కావడంతో, దీనికి మన వర్తమాన రాజకీయ నాయకులు ఎప్పుడూ సమాధానం ఇవ్వరు. అయితే ఇదే ప్రశ్నను ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ను అనంతపురం విద్యార్ధులు ప్రశ్నించారు. కాంపిటిటివ్ పరీక్షలలో రిజర్వేషన్ల ప్రకారం కాకుండా, మెరిట్ ప్రకారం తీసుకునే సౌలభ్యత ఎప్పుడు వస్తుంది? అధికారంలోకి వస్తే మీరేం చేస్తారు? అంటూ ఓ విద్యార్ధిని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ ఆచితూచి స్పందించారు.

రాజ్యాంగానికి సంబంధించిన పుస్తకాలను తానూ చదివానని, వాటిల్లో అంబేద్కర్ గారు కూడా ఈ రిజర్వేషన్ల గురించి ప్రస్తావించారని, అమలులో ఉన్న రిజర్వేషన్ ఒకటి, రెండు తరాల వరకే అమలు చేయాలని, లేని పక్షంలో అప్పుడు అన్ని వర్గాల వారికి అన్యాయం జరుగుతుందని అంబేద్కర్ చెప్పారని, కానీ ప్రస్తుతం వీటిని రద్దు చేసే పరిస్థితి లేదని, ఉన్న రిజర్వేషన్లు కొనసాగిస్తూనే, ఇతర కులాలలో వెనుకబడిన వారికి ఆర్ధికంగా వెన్నుదన్నుగా నిలిస్తే బాగుటుందన్న అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తపరిచారు.

మీరు లేవనెత్తిన సమస్య ఒక్క పార్టీతో తీరేది కాదని, దీని కోసం అన్ని పార్టీలు నడుం బిగిస్తే తప్ప అవ్వదని, ఖచ్చితంగా ఏదొక రోజు అసెంబ్లీ, పార్లమెంట్ లలో ఈ సమస్య గురించి ‘జనసేన’ మాట్లాడుతుందని, జాతీయ స్థాయిలో ఈ సమస్యను ఫోకస్ చేసే బాధ్యత తనదని, తనకు కూడా ఈ రిజర్వేషన్లపై ఓ ఖచ్చితమైన అభిప్రాయం ఉందని, అయితే ఇప్పుడు చెప్తే అది సరిగా అర్ధం చేసుకునేవాళ్ళు లేరని, భవిష్యత్తులో ఈ సమస్యపై దృష్టి కేంద్రీకరించే బాధ్యత తనదని పవన కళ్యాణ్ విద్యార్ధులకు హామీ ఇచ్చారు.

నిజానికి సదరు విద్యార్ధిని అడిగిన ప్రశ్న చాలా సున్నితమైనది. బహుశా వేరే రాజకీయ నాయకుడు అయితే దీనిని రాజకీయ కోణంలో మాట్లాడి, తామూ అధికారంలోకి రాగానే అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేవారేమో. కానీ, పవన్ మాత్రం ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది అన్న అంశంపైనే దృష్టి పెట్టి మాట్లాడడం, ‘జనసేన’ అధినేత ఆలోచనా తీరుకు అద్దం పడుతుంది. ఈ సమస్యపై అసెంబ్లీలో గళం విప్పడానికి పవన్ సిద్ధంగా ఉన్నాడంటే… 2019 ఎన్నికలలో తన గెలుపు ఖాయమని పవన్ ఓ నిర్ణయానికి వచ్చేసినట్లే కదా! అందులో డౌట్ ఏముందిలేండి..!