Pawan Kalyan comments on BJP high commandప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దృష్టి అంతా త్వరలో ఎన్నికలు జరుగబోయే తెలంగాణలోని మునుగోడు ఉపఎన్నికలపైన, ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌ ఎన్నికలపైనే ఉండటం సహజమే. కనుక ఏపీలో ఏం జరుగుతోందో చూస్తున్నా పెద్దగా పట్టించుకొంటున్నట్లు లేదు. బహుశః అందుకేనేమో ఢిల్లీ పెద్దలతో ఎరుగా మాట్లాడగలిగే అవకాశం ఉన్నప్పటికీ పవన్‌ కళ్యాణ్‌ “ఈ విషయంలో మేము కేంద్రానికి మొర పెట్టుకోదలచలేదు… మా పోరాటం మేమే చేస్తామని… ” చెప్పినట్లున్నారు.

గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి జనసేన కాస్త దూకుడుగానే వ్యవహరిస్తున్నట్లు కనబడుతోంది. అందుకే ‘లాఠీ దెబ్బలకు, పోలీస్ కేసులకు భయపడేది లేదని’ పవన్‌ కళ్యాణ్‌ తెగేసి చెప్పారు. తనను హోటల్‌ గదిలో నిర్బందించడం, జనసేన కార్యకర్తలపై హత్యానేరం వంటి తీవ్రమైన సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేయడంపై రేపు గవర్నర్‌కు ఫిర్యాదు చేయబోతుండటం గమనిస్తే, పవన్‌ కళ్యాణ్‌ కూడా రాజకీయ ఫార్ములాలను బాగానే ఒంటబట్టించుకొన్నట్లు అర్దమవుతోంది. కానీ ఇకపై జనసేన కార్యాచరణ ఏవిదంగా ఉండబోతోందనేది దాని రాజకీయ భవిష్యత్‌ని నిర్ణయిస్తుంది. పవన్‌ కళ్యాణ్‌ మళ్ళీ సినిమాలు చేసుకోవడానికి వెళ్ళిపోతే ఇప్పుడు ఆయనకు, పార్టీకి క్రియేట్ అయిన హైప్, జనసైనికుల పోరాటం అంతా వృధా అయిపోతుందని చెప్పవచ్చు.

ఇక ఏపీ బిజెపి గురించి ఈ సందర్భంగా నాలుగు ముక్కలు చెప్పుకోక తప్పదు. తమ మిత్రపక్ష నేత పవన్‌ కళ్యాణ్‌ను పోలీసులు హోటల్‌ గదిలో నిర్బందించి బలవంతంగా హైదరాబాద్‌కు వెనక్కు తిప్పి పంపుతుండటాన్ని బిజెపి నేతలు మొక్కుబడిగా ఖండించడం చూస్తే, రాష్ట్ర రాజకీయాలలో వారు యాక్టివ్ అవడానికి ఇంకా ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్‌ రాలేదని సర్ధిచెప్పుకోవలసి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో కూడా ఏపీ బిజెపి నేతలు ఇంత నిస్తేజంగా, నిర్లిప్తంగా ఎలా ఉండగలుగుతున్నారో వారికే తెలియాలి.

తెలంగాణ బిజెపి నేతలు తమ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తేవాలని అంత పట్టుదలగా కృషి చేస్తుంటే, వారిని చూసైనా ఏపీ బిజెపి నేతలు స్పూర్తి పొందలేకపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః ఢిల్లీలో స్విచ్ ఆన్‌ చేస్తే తప్ప ఏపీ బిజెపి నేతలు పనిచేయ(లే)రా? లేక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తమ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక ఇప్పుడు ఈ మూడు రాజధానులు గొడవలో జోక్యం చేసుకొని మాట్లాడటం అనవసరమని భావిస్తున్నారా?అని సామాన్య ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.