pawan kalyan comments on Alliance with TDPరాబోయే ఎన్నికలలో జనసేన పార్టీతో పొత్తు గురించి ఇటీవల చంద్రబాబు నాయుడు చేసిన ‘వన్ సైడ్ లవ్’ కామెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో ‘బాల్’ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోర్టులో పడింది. పొత్తులపై పవన్ ఏం మాట్లాడతారా? అన్న అంశం రాజకీయంగా ప్రాధాన్యతను దక్కించుకుంది.

తాజాగా ఈ విషయంపై స్పందించిన పవన్… పొత్తులను పూర్తిగా తీసిపారేయలేదు గానీ, ఇప్పుడే ఈ విషయంపై దృష్టి పెట్టవద్దని సూచించారు. ప్రస్తుతం పార్టీ సంస్థాగతంగా బలపడే దిశగా అడుగులు వేయాలని, పొత్తులపై సమయం వచ్చినపుడు ప్రతి ఒక్కరిని సంప్రదించి ఓ నిర్ణయం తీసుకుందామని అన్నారు.

అలాగే వాళ్ళు ఆడే మైండ్ గేమ్స్ ట్రాప్ పడవద్దని, పొత్తు కావాలనుకునే వాళ్ళు, పొత్తుపై విమర్శించే వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదని జనసేన అధినేత వ్యక్తపరిచారు. ప్రస్తుతం పొత్తులపై ప్రస్తావన అవసరం లేదన్నది సమంజసమే అయినా, ఇక్కడ జనసేన అధినేత ఒక చిన్న లాజిక్ ను విస్మరించినట్లుగా కనపడుతోంది.

రాజకీయంగా జనసేన బలపడిన తర్వాత పొత్తుల గురించి ఆలోచిద్దామని చెప్పిన పవన్, నిజంగా జనసేన సంస్థాగతంగా బలపడితే పొత్తుల ఆలోచనలు చేయాలా? మరి ఆ విధంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి పవన్ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి? అన్నది కూడా దిశానిర్ధేశం చేయాల్సి ఉంది. తాత్కాలికంగా పొత్తుల వ్యాఖ్యలకు బ్రేక్ వేయడానికి అయితే పవన్ మాటలు ఉపయోగపడతాయి.

దీనిపై తెలుగుదేశం ఎలా స్పందిస్తుందో పక్కన పెడితే, వైసీపీకి మాత్రం కాస్త ఊరట లభించినట్లే. ఎలాంటి పరిస్థితులలో అయినా ప్రతిపక్షాలన్నీ ఏకం అయితే అధికార పక్షానికి ఇబ్బందులు తప్పవు గనుక, జగన్ కు ఉపశమనం కలిగించడానికి పవన్ మాటలు దోహద పడతాయి. అయితే ఇది తాత్కాలిక ప్రకటనే కావడం జగన్ ను టెన్షన్ పెట్టే అంశం కూడా!

ఎందుకంటే పవన్ కు తన పార్టీ, వ్యక్తిగత ప్రయోజనాల కన్నా రాష్ట్ర శ్రేయస్సు, భవిష్యత్తే ఎజెండాగా పనిచేస్తారు. 2014 ఎన్నికలలో నిస్వార్ధంగా పవన్ చేసిన ప్రచారం తెలియనిది కాదు. చివరి నిముషంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. 2024 క్రియాశీలక రాజకీయాలలో ‘జనసేన’ మార్క్ ను నిజంగా చూపించాలంటే, ఫుల్ టైం పొలిటిక్స్ కు పవన్ శ్రీకారం చుట్టాల్సిందే!