Pawan Kalyan Clarity on Communist Party Allianceప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో ఎర్ర పార్టీలు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను ఇచ్చింది. దీంతో తదుపరి ఎన్నికలలో పవన్ వామపక్ష పార్టీలతో కలవబోతున్నారన్న సంకేతాలు వ్యక్తమయ్యాయి. అయితే దీనిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. “పొత్తుల గురించి పవన్ కళ్యాణ్ తో చర్చలు జరపలేదని, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ప్రజా సమస్యలపై కలిసి పోరాడడంపై మాత్రమే చర్చించామని” స్పష్టం చేసారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంతో కలిసి జనసేన పోరాడుతుందని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. జనసేన కార్యాలయంలో దాదాపు గంటన్నర్ర పాటు ఇదే విషయంపై చర్చించామని తెలిపిన రామకృష్ణ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకున్నామని అన్నారు.

ముఖ్యంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పిన బీజేపీ, అధికారంలోకి రాగానే స్వరం మార్చడంపై చర్చించామని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పేరుతో ఎకరాలకు ఎకరాలు పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడంపై కూడా మాట్లాడామని తెలిపారు. వివిధ ప్రాజెక్టుల పేరుతో అవసరానికి మించినన్ని భూములు తీసుకుంటున్నారన్న తమ అభిప్రాయంతో పవన్ కల్యాణ్ కూడా ఏకీభవించారని, భవిష్యత్ లో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.