Pawan Kalyan Chiranjeevi Politics Janasenaరొటీన్ రాజకీయాలు చేయడానికి తాను రాలేదంటూ ‘జనసేన’ను ప్రారంభించిన పవన్ కళ్యాణ్, తొలినాళ్ళల్లో అలాంటి రాజకీయాలనే చేసారు కూడా! దీంతో అన్ని వర్గాలకు చేరువ కాకపోయినా, సమాజంలో సమూల మార్పు కోసం పవన్ ప్రయత్నిస్తున్నారని అభినందనలు అందుకున్నారు. అయితే దీనినే మరికొందరి భాషలో చెప్పాలంటే… పవన్ కాస్త తేడాగా ఉన్నాడే… అన్న మాటలు వినిపించాయి. అయితే ఆ ‘తేడా’నే ఇతర రాజకీయ నాయకుల నుండి పవన్ ను వేరుచేసి, తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకునేలా చేసాయి.

అయితే కాలం గడుస్తున్న కొద్దీ… పవన్ లో ఉన్న ఆ ‘స్పెషల్’ విలక్షణతకు తిలోదకాలు ఇచ్చేస్తున్నట్లుగా కనపడుతోంది. ముఖ్యంగా రొటీన్ రాజకీయాలకు పవన్ కూడా అలవాటు పడిపోతున్నారా? అన్న సందేహాలను ప్రజలలో కలిగిస్తోంది. ఎందుకంటే… ఇటీవల కాలంలో పవన్ చేస్తున్న వ్యాఖ్యలు, ఎక్కువగా రాజకీయ లబ్దిని చేకూర్చే విధంగానే ఉంటున్నాయి తప్ప, మునుపటి మాదిరి ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం లేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ విషయంలో పవన్ అనుసరించిన వ్యూహం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ‘ప్రత్యేక ప్యాకేజ్’ చట్టం చేయక ముందు వరకు, ‘ప్రత్యేక హోదా’ గురించి పోరాడకుండా సైలెంట్ గా ఉన్న పవన్, ఆ చట్టం జరిగిన తర్వాత జగన్ మాదిరే ‘స్పెషల్ స్టేటస్’ భజన చేస్తున్నారు. నిజానికి ‘స్పెషల్ స్టేటస్’ రాదన్న విషయం కనీస రాజకీయ అవగాహన కలిగిన వారికి కూడా ఇట్టే అవగతమవుతుంది. అయినప్పటికీ ఇంకా ఎందుకు ప్రాకుల్లాడుతున్నారంటే… రాజకీయ లబ్దిలో భాగంగానే అని చెప్పవచ్చు.