pawan kalyan - chiranjeevi-nadendla manohar2019 ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడా చిరంజీవి పేరు వాడేవారు కాదు. నేను ఒక సామాన్య పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడే వారు. ప్రజారాజ్యం తాలుక ఫెయిల్యూర్.. కాంగ్రెస్ తో విలీనం వంటి వాటి ప్రభావం జనసేన మీద పడకుండా పవన్ ఆ జాగ్రత్త తీసుకునే వారని అంటూ ఉండేవారు.

అయితే చిరంజీవి అభిమానులకు ఆ విషయంలో బాధగా ఉండేది. అయితే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారికి మాత్రం ప్రజారాజ్యం ఉదంతం కారణంగా పవన్ ఓడిపోయారని చిరంజీవి మీద కోపంగానే ఉంటారు. ఈ తరుణంలో జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా ఒక బాంబు పేల్చారు.

మళ్లీ సినిమాలు చేయాలని పవన్‌ను ఒప్పించింది చిరంజీవే అని ఆయన చెప్పుకొచ్చారు. “కొద్ది కాలం సినిమాలు చేయాలని పవన్‌కు చిరంజీవి సూచించారు.. పవన్‌ రాజకీయ ప్రస్థానంలో తానూ ఉంటానని చిరంజీవి చెప్పారు,” అని మనోహర్ ఒక కార్యకర్తల సమావేశం లో చెప్పుకొచ్చారు. సినిమాలు చెయ్యడం వల్ల పవన్ ని సీరియస్ రాజకీయ నాయకుడిగా తీసుకోలేదని చాలా మంది అభిప్రాయం.

మనోహర్ తాజా వ్యాఖ్యలతో ఎవరైతే ప్రజారాజ్యం ఉదంతం కారణంగా పవన్ ఓడిపోయారని చిరంజీవి మీద కోపంగా ఉన్నారో వారు మరింతగా మెగాస్టార్ పై చిరుబురులాడుతున్నారు. కొందరు మాత్రం చిరంజీవిని కాదని పార్టీ పెట్టినవాడు ఆ మాత్రం సినిమాల విషయంలో సొంత నిర్ణయం తీసుకోలేదా అంటూ చిరంజీవి ని సమర్థిస్తున్నారు. బహుశా తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా చిరంజీవి అభిమానులు, సామాజికవర్గ ఓట్ల కోసం నాదెండ్ల ఈ ప్రస్తావన తెచ్చి ఉండవచ్చు. అయితే ఇది ఇప్పుడు మెగా అభిమానులలో చీలిక తెచ్చింది.