Pawan Kalyan - Chiranjeevi-స్టార్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానుల నుండి సినీ తారలు, రాజకీయ నాయకుల వరకూ అందరు ఆయనను ఈ సందర్భంగా విష్ చేస్తున్నారు. పవన్ సోదరుడు చిరంజీవి కూడా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విషెస్ తెలిపారు.

“తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే.. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే.. తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే ..తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే… జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు…. కళ్యాణ్ బాబు Happy Birthday,” అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే అంటూ చిరంజీవి అనడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

2014 సమయంలో చిరంజీవి కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉండగా పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ హటావో అంటూ జనసేన పార్టీని స్థాపించారు. ఆ సమయంలో మా మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే అంటూ చిరంజీవి చెప్పుకొచ్చే వారు. తరువాతి కాలంలో ఆయన రాజకీయాలకు దూరంగా ఉండి సినిమాలు చేసుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో ఒకటి రెండు సార్లు తాను ఏ రాజకీయ పార్టీలోనూ లేను అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇటువంటి సందర్భంగా కూడా మా మార్గాలు వేరు అని చెప్పడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాను జనసేనకు బీజేపీకి దూరం అని చిరంజీవి చెప్పదలిచారా అంటూ కొందరు అంటున్నారు.