pawan-kalyan-chiranjeeviమెగాస్టార్ చిరంజీవి సినీ జీవితం గురించి ఎంత గొప్పగా చెప్తారో, రాజకీయ జీవితం గురించి అంత చెత్తగానూ చెప్తారు. దీనికి కారణం అంది వచ్చిన అవకాశాలను చిరంజీవి తన వైపుకు మలుచుకోలేకపోవడమే అన్నది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. అవును… 2009 ఎన్నికలలో ఖచ్చితంగా తమదే విజయం అంటూ బరిలోకి దిగిన ‘ప్రజారాజ్యం’ చిరంజీవికి, కనీసం ‘కింగ్ మేకర్’ స్థానం అయినా దక్కుతుందని అంచనా వేసారు. కానీ, ప్రజాతీర్పు దానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ, వైఎస్ అకాల మరణం ద్వారా చిరంజీవికి ఒక మంచి అవకాశాన్ని లభించినట్లయ్యింది.

కానీ, చిరు దానిని సరిగా వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. నాడు ‘ప్రజారాజ్యం’ విలీనం కాకుండా, ప్రభుత్వాన్ని పడగొట్టినట్లయితే, కొంతలో కొంత చిరు రాజకీయ జీవితంపై ప్రజలకు గౌరవభావం దక్కేది. అలా కాకుండా చేతికి వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్న చిరంజీవి, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా ప్రజల మనస్సులో ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా! ఇక, చిరు తమ్ముడిగా సినీ హీరోగా పరిచయమైనా… ‘జనసేన’ పార్టీ స్థాపించే సమయానికి పవన్ అన్నయ్యగా చిరు మారిపోయాడు. అంతలా పవన్ కు ప్రజల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది.

‘తానూ పార్టీ స్థాపించింది అధికారం కోసం కాదు’ అని స్పష్టమైన నినాదంతో బరిలోకి దిగిన ‘జనసేన’ గమ్యం మొన్నటివరకు ఎవరికీ అంతుచిక్కలేదు. అయితే ఎప్పుడైతే తిరుపతిలో పెట్టిన సభతో ఉవ్వెత్తున లెగిసిందో, పవన్ కళ్యాణ్ పై అందరి ఆశలు చిగురించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే… కులాలతో, మతాలతో, మీడియా వర్గీకరణలతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి వర్గం ‘కాకినాడలో పవన్ ప్రత్యేక హోదాపై ఏం చెప్తారా?’ అని ఎదురుచూసారు. అంత ఆసక్తిని ఒక గంట సమయంలోపే పవన్ తీవ్రంగా నిరుత్సాహపరిచారు.

నిజంగా అదే కాకినాడలో ‘ప్రత్యేక హోదా’పై ఒక స్పష్టమైన పోరాటాన్ని, ఉద్యమాన్ని పవన్ తీసుకున్నట్లయితే… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి ఎలా ఉండేదో ఊహించసాధ్యం కూడా కాదని చెప్పవచ్చు. అన్ని సార్లు ప్రజల నుండి ఆ ‘వేవ్’ రాదు, వచ్చిన సమయంలో ప్రజాకాంక్షకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే, బహుశా దేశ వ్యాప్తంగా పవన్ పేరు మారుమ్రోగినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఈ ఏడాది చివరి వరకు వేచిచూసే ధోరణిలో ఉంటానని చెప్పిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ఎలాంటి సంచలనమైన నిర్ణయం తీసుకున్నా… అన్ని వర్గాల ప్రజల నుండి కాకినాడ సభకు వచ్చినంత మద్దతు లభించకపోవచ్చు.

మెగా సోదరులిద్దరూ అంది వచ్చిన అవకాశాలను అందుకోవడంలో విఫలమవ్వడం అభిమానులకు జీర్ణించుకోలేని విషయం. అయితే చిరు రాజకీయ జీవితం దాదాపుగా పరిసమాప్తం కాగా, పవన్ మాత్రం బరిలోనే ఉన్నారు. అధికారం కోసం కాకపోయినా ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ‘జనసేన’ను ఖచ్చితంగా బరిలోకి దింపుతానని చెప్తున్నారు. అయితే అప్పటివరకు పవన్ ఇదే ఊపును ప్రజల్లో నింపుతారా? కేవలం రెండున్నర్ర సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్న నేపధ్యంలో ‘ప్రత్యేక హోదా’పై ఇంకా వేచిచూసే ధోరణిని అవలంభించడం సరైనదేనని పవన్ ఆలోచనలకు ప్రజలు మద్దతు పలుకుతారా? కాలమే సమాధానం చెప్పాలి. అయితే, ప్రజా జీవితాలు బాగుపడాలని నిస్వార్ధంగా కోరుకునే పవన్ లాంటి వ్యక్తులు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.