జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి టిడిపితో కలిసి ఎన్నికలకి వెళ్తామన్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా జాగ్రత్తపడుతూ ముందుకు సాగుతామని పదేపదే చెపుతున్నారు. మంచిదే! కానీ హరిరామజోగయ్యవంటి కొందరు కాపు నేతలు, జనసేనలో కొందరు నేతలు కూడా టిడిపి-జనసేనల పొత్తులు చాలా అవసరమని చెపుతూనే పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
టిడిపి-జనసేనలు పొత్తులు పెట్టుకొంటే ఎక్కువ స్థానాలు టిడిపియే తీసుకొంటుంది కనుక సహజంగానే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అభ్యర్ధి అవుతారు.
ఒకవేళ పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలంటే 1. ఒంటరిగా పోటీ చేసి గెలవాల్సి ఉంటుంది. 2. బిజెపితోనే పొత్తులు కొనసాగించవచ్చు. 3. టిడిపి-జనసేనలు సరిసమానంగా సీట్లు సర్దుబాటు చేసుకోవలసి ఉంటుంది.
ఈసారి ఎన్నికలలో జనసేన ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందాలని కోరుకోవడంలేదని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. టిడిపితో కలిసి పనిచేస్తామని చెపుతున్నారు. టిడిపితో పొత్తులు పెట్టుకొంటే జనసేనకి 15-25 సీట్లు కోరవచ్చు. పొందవచ్చు. అంతకి మించి సాధ్యం కావు.
ఇక పవన్ కళ్యాణ్‌ని బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా అంగీకరిస్తోంది. బిజెపి వెనుక బలమైన కేంద్ర ప్రభుత్వం ఉంది. కానీ ఏపీ నిలువునా మునిగిపోతున్నా బిజెపి, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కనుక పవన్ కళ్యాణ్ బిజెపిని నమ్ముకొంటే మరోసారి జనసేన పార్టీ ‘వీరమరణం’ చెందడం ఖాయమే.
రాజకీయాలలో తలపండిన హరిరామ జోగయ్య లేదా జనసేన నేతలకి ఇవన్నీ తెలియవనుకోలేము. అయినా పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉండాలని డిమాండ్ చేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం కంటే టిడిపి-జనసేనలు కలిసి పోటీ చేసి, ఎన్నికలలో గెలిచి, కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, దానిలో పవన్ కళ్యాణ్‌కి మంత్రి పదవి ఇవ్వాలని కోరుకొంటే రెండు పార్టీలకి, రాష్ట్రానికి, ప్రజలకి అందరికీ మంచిది. లేకుంటే వారి ఈ డిమాండ్ రెండు పార్టీల పొత్తులకి విఘాతం కలిగించడమే కాదు… ఏపీలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు జనసేన పార్టీయే తోడ్పడిన్నట్లవుతుందని గ్రహిస్తే మంచిది.