ప్రస్తుత వైసీపీ పరిపాలనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో… 2024 ఎన్నికల హంగామా అప్పుడే మొదలయ్యింది. పొత్తుల విషయం కూడా ఇటీవల చంద్రబాబు చేసిన బహిరంగ వ్యాఖ్యలతో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం పొత్తులపై ఎవరు ఎలాంటి ప్రకటనలు చేసినా, అంతిమంగా 2024లో పొత్తులతోనే ఎన్నికలు జరుగుతాయనేది స్పష్టం.
జనసేన గనుక ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలనేది జనసైనికుల ఆకాంక్ష. ఒకవేళ వచ్చే ఎన్నికలలో బీజేపీ – జనసేన పార్టీలు గనుక పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళితే, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాత్రమే సీఎం అభ్యర్థి అంటూ రఘురామకృష్ణంరాజు తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.
జనసేనకు రాష్ట్రం మొత్తం మీద 10 శాతం ఓటింగ్ ఉందని, అదే బిజెపికి కేవలం 1 శాతం మాత్రమే ఓటింగ్ ఉందని, కాబట్టి ఎవరిది ఎక్కువ శాతం ఉంటే సహజంగా వారే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని, అలాగే ఈ రెండు పార్టీలలో ఒక చరిష్మా కలిగిన నాయకుడిగా చూసిన పవన్ ఒక్కడేనని, ఆ రకంగా చూసినా ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనేనని తెలిపారు ఆర్ఆర్ఆర్.
ఈ విషయాన్ని ఇటీవల సోము వీర్రాజు కూడా తెలిపారని, ముందుగా బీజేపీ అభ్యర్థి సీఎంగా ఉంటారని ప్రకటించి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అంటూ ప్రకటన ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసారు. ఒకవేళ జనసేన – బీజేపీ – టీడీపీలు కలిసి పోటీ చేస్తే మాత్రం, సీఎం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు మాత్రమే ఉండొచ్చని తాను అనుకుంటున్నట్లుగా ఉదహరించారు.
ఈ మూడు పార్టీలలో ఓటింగ్ షేర్ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఉంటుంది గనుక, ఆ పార్టీ అభ్యర్థి సీఎంగా ఉంటారని, ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ సీఎం కాకపోయినప్పటికీ, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటారనేది తన అభిమతంగా చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికలలో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే విజయానికి తిరుగుండదన్న భావన ఆర్ఆర్ఆర్ వ్యాఖ్యల్లో వ్యక్తమయింది.
పవన్ కళ్యాణ్ ను తాను ప్రత్యక్షంగా కలిసానని చెప్పిన ఆర్ఆర్ఆర్, రాష్ట్రానికి ఏదో మంచి చేయాలన్న తపన కనపడిందని అన్నారు. డబ్బుల కోసమో, పదవుల కోసమో, పాపులారిటీ కోసమో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి పవన్ కాదని, కేవలం ప్రజలకు ఏదో చేయాలన్న ఆలోచనలతోనే సినిమా రంగంలో అగ్ర హీరోగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చారని కితాబిచ్చారు.
కృష్ణాజిల్లా నుండి విశాఖపట్నం వరకు జనసేన ప్రభావం ఉంటుందని, ఈ బెల్ట్ అంతా కలిపి 13 నుండి 15 శాతం ఓటింగ్ శాతాన్ని పవన్ రాబడతాడని, ఇది తన సొంత పార్టీ గెలుపుకు దోహదం చేయకపోయినా, పొత్తులు ఉంటే ఇతర పార్టీలతో కలిసి అధికారంలోకి రావడానికి, అలాగే మరో పార్టీకి అధికారాన్ని దూరం చేయడానికి ఉపయోగపడుతుందని విశ్లేషించారు.
రాయలసీమలో జనసేన ప్రభావం పెద్దగా లేదని, గత ఎన్నికలలో ఇతర పార్టీలైన బీఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలకు కొన్ని సీట్లు ఇవ్వగా మిగిలిన పోటీ చేసిన స్థానాలలో 8 శాతం వరకు ఓట్లు రాబట్టుకున్నారని, ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 10 శాతం ఓట్లు వస్తాయని అంచనా ఉందని, ఇదేమి తక్కువ శాతం కాదని, వచ్చే ఎన్నికలలో జనసేన ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని స్పష్టత ఇచ్చారు.