pawan kalyan chief guest for nannaku prematho audio launchఒక అగ్ర హీరో సినీ వేడుకలకు మరో అగ్ర హీరో ముఖ్య అతిధిగా విచ్చేయడం మన తెలుగు సినీ పరిశ్రమలో బాగా అరుదుగా జరిగే విషయం. అయితే “నాన్నకు ప్రేమతో” ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించడానికి చిత్ర నిర్మాత సిద్ధమవుతోందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

‘అత్తారింటికి దారేది’ సినిమాను నిర్మించిన బివివిఎస్ఎన్ ప్రసాద్ పవన్ తో మంచి సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉన్న విషయం తెలిసిందే. విడుదలకు ముందే పైరసీ బారిన పడిన ఆ సినిమాకు పవన్ తన పూర్తి సహకారం అందించి, నిర్మాతకు అండగా నిలబడ్డారు. ఈ సంబంధంతోనే ప్రస్తుతం తానూ నిర్మిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించాలని భావిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అయితే, ఒకవేళ అదే జరిగితే, పవన్ వస్తే ఆడియో వేడుక పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఊహించుకోవచ్చు. ఇటీవల ప్రభాస్ ను ఇబ్బంది పెట్టిన పవన్ అభిమానులు, రేపు జూనియర్ కు కూడా అలాంటి అనుభూతులనే మిగిల్చవచ్చు. కావున ‘బుడ్డోడు’ను కాస్త జాగ్రత్త పడమంటున్నారు నెటిజన్లు. అయితే జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరో సినిమాకు పవన్ కళ్యాణ్ వంటి హీరో హాజరైతే అభిమానులకు ఓ పాజిటివ్ సందేశాలను పంపిన వారవుతారు.