ఎదురుకున్న మొదటి ఎన్నికలలో జనసేనకు కేవలం ఒక్కే ఒక్క సీటు తన ఖాతాను తెరిచింది. తన తొలి ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీ పేలవమైన ప్రదర్శన తో పాటు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసినా రెండు సీట్లలో లోను ఓడిపోయారు. కేవలం 5% పై చిలుకు ఓటు షేర్ తో అప్పటి ప్రజారాజ్యం పార్టీ కంటే పేలవమైన ప్రదర్శన కనబరిచింది. దీనితో పార్టీ మనుగడ మీదే అనుమానాలు మొదలయ్యాయి.

గత నాలుగు రోజులుగా ఓటమిపై సమీక్ష చేస్తున్నారు పవన్ కళ్యాణ్. నిన్న తన ఓటమి గురించి ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శాసనసభ ఎన్నికల్లో భీమవరంలో తనను ఓడించేందుకు 150 కోట్లు ఖర్చు చేశారని తెలిసిందని, శాసనసభలో తాను అడుగు పెట్టకుండా ఎలాగైనా ఓడించాలనేదే దాని వెనుక లక్ష్యమని పవన్‌ కల్యాణ్‌ సంచలనాత్మక ఆరోపణ చేశారు. డబ్బు ప్రభావం వల్లే రెండు చోట్లా పవన్ కళ్యాణ్ ఓడిపోయారంటే అది ఆత్మవంచనే అవుతుంది. పైగా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి పోటీ చేస్తున్నప్పుడు డబ్బు ప్రభావం సదరు నియోజకవర్గం మీద పని చెయ్యకూడదు.

చంద్రబాబు పోటీ చేసే కుప్పం గానీ, జగన్ పోటీ చేసే పులివెందుల కానీ అలాంటివే. 150 కోట్లతో నన్ను ఓడించారు అంటే పవన్ కళ్యాణ్ తనను తాను మోసం చేసుకున్నట్టే. భీమవరంలో మిగతా పార్టీలు అంత కాకపోయినా జనసేన కూడా డబ్బులు పంచింది. లోకమంతా తెలిసిన ఆ విషయం పవన్ కళ్యాణ్ కు తెలీకుండా ఉండి ఉండదు. కర్ణుడి చావుకి ఉన్నట్టు పవన్ కళ్యాణ్ ఓటమికి చాలానే కారణాలు ఉన్నాయి. వాటిని డబ్బు ప్రభావం అని తేల్చేసి విస్మరిస్తే అది జనసేనకు పవన్ కళ్యాణ్ కు మంచిది కాదు.