Pawan Kalyan to Contest in Two Places in 2019?ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తుమ్మితే అది ‘బ్రేకింగ్ న్యూస్’లా అన్ని ప్రముఖ మీడియా ఛానల్స్ లో వచ్చేసేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పవన్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అని తెలుసుకోవాలంటే, స్వయంగా జనసేన వర్గీయులు సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేసుకోవాలి లేదంటే జగన్ మీడియా అయిన సాక్షి పైన ఆధారపడాల్సి ఉంది. అవును… ఎలక్ట్రానిక్ మీడియాలలో సాక్షి ఒక్కటే పవన్ కళ్యాణ్ పర్యటనలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తోంది. అది కూడా కొన్ని ‘టర్మ్స్ అండ్ కండిషన్స్’ మాదిరిగా!

కేవలం చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ ఏమైనా విమర్శలు చేస్తే తప్ప సాక్షి కూడా పవన్ వ్యాఖ్యలకు గానీ, పర్యటనలకు సంబంధించిన అప్ డేట్స్ గానీ ఇవ్వడం లేదు. ఎందుకంటే అక్కడ పవన్ ప్రాధాన్యతను పెంచితే, జగన్ పాదయాత్ర పరిస్థితి ఏం కానూ? దీంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అన్న పేరు మీడియా వర్గాలకు రియల్ “అజ్ఞాతవాసి”లా కనపడుతోంది. మీడియా వర్గాలపై ముందు, వెనుక ఆలోచించకుండా పవన్ చేసిన ఆరోపణలు, ట్వీట్ల ప్రభావం ఇదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, మరికొద్ది రోజుల్లో బస్సు యాత్ర జరగనున్న నేపధ్యంలో… వాటికి లైవ్ అప్ డేట్స్ గానీ, ప్రాధాన్యత గానీ లభించకపోతే పవన్ పర్యటనల వలన ‘జనసేన’కు ప్రయోజనం చేకూరుతుందా? రాష్ట్ర ప్రజల మీద ప్రభావితం చూపుతుందా? లేదంటే ఎలాగూ టార్గెట్ చేసేది చంద్రబాబు నాయుడు ఒక్కరే గనుక, జగన్ మీడియా అయిన ‘సాక్షి’ వంటి ఛానల్స్ తో ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకోవాలా? ఏమో!? ఏం జరుగుతుందో గానీ, పవన్ కళ్యాణ్ అన్న పేరు మీడియా వర్గాలకు రుచించడం లేదు.