Pawan Kalyan burst on caste based politicsముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడుతున్నారు… ఇది గడిచిన రెండు నెలలుగా జరుగుతున్నదే! రాజకీయాలలో విమర్శలు – ప్రతివిమర్శలు సహజం గనుక, దీంతో ప్రస్తుతం పవన్ చేస్తోన్న విమర్శలు రొటీన్ అయిపోయాయి. కానీ గురువారం నాడు పాడేరు వేదికగా కుల రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి చంద్రబాబుపై మండిపడ్డారు.

‘పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేస్తున్నారని, కులాన్ని నమ్ముకునే వచ్చారని’ చంద్రబాబు ఎలా అంటారు? అదే నిజమైతే గత ఎన్నికలలో నేను మీకెందుకు సహకారం అందిస్తాను? ఆ మాట అనడానికి మీకు నోరెలా వస్తుంది? ఛీ… మీ మీద గౌరవం పోగొట్టుకుంటున్నారు, అస్సలు మీ స్థాయికి అనాల్సిన మాటలేనా? అంటూ తీవ్రస్థాయిలో చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు.

నిజమే… లాజిక్ ప్రకారం పవన్ ఆవేదనలో 100% అర్ధముంది. కానీ ‘కుల రాజకీయాలు చేస్తున్నారనే’ విమర్శలకు తావిచ్చింది ఎవరు? అంటే పవన్ స్వయంకృతాపరాధమే కనపడుతుంది. ఎందుకంటే… జనసేన పార్టీ పదవులలో 99 శాతం మంది తన సామాజిక వర్గానికి చెందిన వారికి కట్టబెట్టడమే ఇలాంటి విమర్శలకు అవకాశం ఇచ్చింది. ఒక వేలు అవతలి వారిపై చూపిస్తే… నాలుగు వ్రేళ్ళు మన వైపు చూపిస్తాయని పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా చెప్పాలా!

అయినా రాజకీయాలలో ఇలాంటి విమర్శలన్నీ సర్వసహజం. ఎందుకంటే సాక్ష్యాలు లేకుండా అవినీతి జరిగిందని ప్రతి అంశంలోనూ పవన్ ఎలా అయితే ఆరోపణలు చేస్తున్నారో… అలాగే జనసేనలో ఉన్న లొసుగులును ప్రత్యర్ధి పార్టీలు ఎత్తిచూపడం అనేది రాజకీయాలలో ఒక భాగం. విమర్శలను స్వీకరించలేనపుడు, చేసే అర్హతను కూడా కోల్పోతారన్న కనీస నీతి సూత్రం జనసేన అధినేతకు అవగతం లేదంటారా?!