Pawan-Kalyan-BJP-Jana-Sena-Allianceజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చినా ఆ తరువాత 2018లో ఆ పార్టీ మీద ఉన్నట్టుంది విరుచుకుపడినా అన్నీ అనుకోనివే. తాజాగా అటువంటి షాక్ ఆయన బీజేపీకి ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎప్పుడూ విరుచుకుపడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనూహ్యంగా ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు.

ఈ మేరకు శుక్రవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు, అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులిని, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం అభినందనీయం. అలాగే, గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా ప్రభుత్వం పనిచేస్తున్న తీరు అభినందనీయం.’’ అని పవన్ ప్రశంసలు కురిపించారు.

‘‘ఇది ప్రపంచానికే గడ్డు కాలం.. అందుకే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సహకరిద్దాం. క్షేమంగా ఉందాం’’ అంటూ ప్రజలకు జనసేని పిలుపునిచ్చారు. ఈ విషయం ద్వారా తాను విలక్షణమైన రాజకీయ నాయకుడిని అని పవన్ కళ్యాణ్ అనిపించుకునే ప్రయత్నం చేసినా అది మిత్రపక్షమైన బీజేపీని షాక్ కి గురిచేసింది.

అంబులెన్సుల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని బీజేపీ కూడా విమర్శిస్తోంది. ఆ మేరకు ఆరోపణలు చేస్తూ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు కూడా. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు వైఎస్సార్ కాంగ్రెస్ తమకు ఈ విషయంలో క్లీన్ చిట్ గా ఉపయోగించుకుంది. రాజకీయంగా ఇది నష్టమే. అదే సమయంలో అమరావతి ఉద్యమం పూర్తయిన సందర్భంగా బీజేపీ ముఖ్య నాయకులు రైతులకు అనుకూలంగా ట్వీట్లు పెడుతుంటే… పవన్ ఆ విషయం జోలికి పోకుండా ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు.