pawan-kalyan-bjp-alliance-andhra-pradesh-municipal-electionsగ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల మీద జనసేన పార్టీ చాలానే ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికలలో విశాఖ పార్లమెంట్ లో ఆ పార్టీకి గణనీయమైన ఓట్లు వచ్చాయి. జేడీ లక్ష్మీనారాయణ అభ్యర్థి కావడం వల్ల ఎక్కువ ఓట్లు వచ్చాయి అయితే జనసేనకు అక్కడ బేస్ గట్టిగానే ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ గాజువాక నుండి పోటీ చేశారు.

ఈ ఎన్నికలలో మెరుగైన ఫలితాలు రాబడతాం అనుకుంటే జనసేనకు బీజేపీ రూపంలో ఇబ్బంది ఎదురయ్యింది. విశాఖలో ఉక్కు ప్రైవేట్ పరం చేయవ‌ద్దు అంటూ నెల రోజులుగా ఆందోళనలు సాగుతున్నాయి. ఈ తరుణంలో బీజేపీ అగ్రనేతలు విశాఖలో ప్రచారం మొదలుపెట్టారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఒకరికొకరు పొంతన లేకుండా ప్రకటనలు చేస్తున్నారు.

“వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ పోదు.. ఇక్కడే ఉంటుంది.. విశాఖ అభివృద్ధికి మోడీ తోడ్పడ్డారు.. జనసేన, బీజేపీ కార్యకర్తలు జీవీఎంసీలో విజయం సాధించాలి, కుట్రలు పన్ని మోడీపై నిందలు వేస్తున్నారు,” అంటూ సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. మిగతా నాయకులు అయితే అదేమంత విషయం కాదన్నట్టు తమ పనిలో తాము ఉన్నారు.

మాజీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియా ముందుకు వచ్చి మా ప్రయత్నం మేము చేస్తాం కానీ తుది నిర్ణయం కేంద్రానిదే అని చెప్పుకొచ్చారు. వీళ్లంతా కలిసి పవన్ కళ్యాణ్ ని ముంచుతారేమో? అని జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు… ఇంకో వారం రోజులలో పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. అప్పుడు ఆయన ఈ అంశం గురించి ఏం చెబుతారు అనేది చర్చనీయాంశంగా మారింది.