Pawan Kalyan Birthday Bannersఅధికారంలో ఎవరు ఉంటే వారికి అధికారులు కూడా దాసోహం అనడం ఆనవాయితీగా మారుతుంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా లో అదే పరిస్థితి నెలకొంది. ఈ నెల రెండో తరీఖున పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున బ్యానర్లు కట్టారు. అయితే వెనువెంటనే మునిసిపల్ అధికారులు వాటిని తొలగించారు.

అయితే అదే సమయంలో వైఎస్ వర్ధంతిని పురస్కరించుకుని అధికార పార్టీ నేతలు, అభిమానులు కట్టిన బ్యానర్ లను మాత్రం ముట్టుకునే సాహసం చెయ్యలేదు. స్థానికంగా ఉండే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఆర్డర్ అని అనధికారికంగా చెప్పడం విశేషం. జిల్లా హెడ్ క్వార్టర్ ఏలూరు లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది.

సదరు ఎమ్మెల్యే గారు మా బ్యానర్లు తప్ప ఏవి కనిపించినా ఊరుకునేది లేదని గట్టిగా చెప్పేసారట. కొన్ని చోట్ల పవన్ అభిమానులు, జనసేన అభిమానులు నిరసన ప్రదర్శనలు చేసే ప్రయత్నం చెయ్యగా లాక్ డౌన్ ఉల్లంఘన కేసులతో వారిని బెదిరించారట. దీనితో జనసేన అభిమానులు కోపంతో రగిలిపోతున్నారు.

దీనికి అధికార పక్షం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. కేంద్రంలో అధికారం లో ఉన్న జనసేన పరిస్థితి ఇలా ఉంటే ఇక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది ఇలా ఉండగా.. పవన్ కళ్యాణ్ బర్త్ డే ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక చోట్ల ఆ పార్టీ కార్యకర్తలు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి తమ విశిష్టత చాటుకున్నారు.