“ఆర్ఆర్ఆర్” జనవరి 7వ తేదీన రిలీజ్ పుణ్యమా అంటూ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” విడుదలపై ఇప్పటికీ అనేక సందేహాలు నెలకొన్నాయి. ట్రేడ్ వర్గాలలో నేడు హల్చల్ చేసిన సమాచారం ప్రకారం… సంక్రాంతికి “ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, బంగార్రాజు” సినిమాలు మాత్రమే విడుదల అవుతున్నాయని, ‘భీమ్లా నాయక్’ వాయిదా ప్రకటన ఉండబోతోందన్న టాక్ బలంగా వ్యక్తమయింది.
అయితే ఇవన్నీ పటాపంచలు చేస్తూ “భీమ్లా నాయక్” చిత్ర నిర్మాత నాగవంశీ ట్విట్టర్ లో మరోసారి ఈ సినిమా విడుదల గురించి స్పష్టం చేసారు. ‘లాల్ భీమ్లా’ రష్ ఇప్పుడే చూశానని, 2022, జనవరి 12వ తేదీన ధియేటర్స్ లో బ్లాస్ట్ చేయడానికి సిద్ధం కావాలంటూ అభిమానులకు పిలుపునిచ్చారు. దీంతో ‘భీమ్లా నాయక్’ రిలీజ్ పై నెలకొన్న సందేహాలకు శుభంకార్డు పడింది.
ఇటీవల రిలీజ్ అయిన ‘అడవి తల్లి’ పాటలో కూడా జనవరి 12వ తేదీన ‘భీమ్లా నాయక్’ డ్యూటీ ఎక్కబోతున్నారని చెప్పిన సంగతి తెలిసిందే. ఇలా ప్రతి నాలుగైదు రోజులకు ‘వాయిదా’ వార్తలు రావడానికి ప్రధాన కారణం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మాత్రమే. అయిదు రోజుల గ్యాప్ లో రెండు మాస్ సినిమాలకు సరిపడ ధియేటర్స్ ఏపీ, తెలంగాణాలలో లేకపోవడమే ఈ పోస్ట్ పోన్ హంగామా!
మొత్తానికి నిర్మాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వెనువెంటనే ప్రతిస్పందించడంతో, పవర్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దీంతో ‘తగ్గేదేలే’ అనడం పవర్ స్టార్ ఫ్యాన్స్ వంతు! ఇప్పటికే నాలుగు పాటలు విడుదల కాగా, మరొక పాట మరియు సినిమాకు కీలకమైన ధియేటిరికల్ ట్రైలర్ రావాల్సి ఉంది. ప్రస్తుత ట్రేడ్ వర్గాల టాక్ ప్రకారం డిసెంబర్ 31వ తేదీన “భీమ్లా నాయక్” ట్రైలర్ ను రిలీజ్ చేసే సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.