Pawan Kalyan behaving like other politiciansబీజేపీ జనసేన పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో కలిసిపని చెయ్యాలని నిర్ణయించున్నాయి. రాబోతున్న స్థానిక ఎన్నికల నుండి 2024 సాధారణ ఎన్నికల వరకూ వచ్చే అన్ని ఎన్నికలలోనూ కలిసి పోటీ చెయ్యాలని ఇరు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయి. దీనితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ప్రయోగానికి నాంది పలికినట్టు అయ్యింది. నిన్న ఇరుపార్టీల నేతల సమావేశం అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ప్రత్యేక హోదాపై నన్ను కాదు..22 మంది ఉన్న వైసీపీ ఎంపీలను అడగండి ఎంపీలను ఇస్తే హోదా తెస్తా అన్న వైసీపీ ఇప్పుడేం చేస్తుంది?,” అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. దీని బట్టి ప్రత్యేక హోదా ఇచ్చి ఆలోచన బీజేపీకి గానీ, అడిగే ఉద్దేశం పవన్ కళ్యాణ్ కు గానీ లేదని స్పష్టం చేసేశాడు.

అసలు ఆ విషయం పక్కన పెడితే… ఎంపీలు ఇచ్చారు కాబట్టి వైఎస్సార్సీపీ సమాధానం చెప్పాలి… నాకు ఇవ్వలేదు కాబట్టి నాకు బాధ్యత లేదు అనడం ఎంత వరకూ రైట్ అనేది పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలి. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న వారికే కాదు లేని వారికి కూడా బాధ్యత ఉంటుంది. ఆ మాటకొస్తే ఇది వరకు ప్రత్యేక హోదా కావాలని అడిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కు ఎంపీలు లేరు.

మా రాజకీయ అవసరాల కోసం ప్రత్యేక హోదా అనే అంశం పక్కన పెట్టేశాం అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ మోహమాటపడినా అది అర్ధం అవుతూనే ఉంది. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇది సాధించా అని చెప్పుకుంటే వచ్చే గౌరవం నేను బేషరతుగా మోడీకి మద్దతు ఇస్తున్నా అని చెప్పుకోవడంలో ఉండదు. అది పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ కు ఎంతో ఉపయోగపడేది. నేను అందరిలాంటి రాజకీయనాయకుడిని కాదు అని చెప్పుకునే అవకాశం ముందుముందు కూడా ఉండేది.