Pawan Kalyan Attended Kapu Community Meetingనాకు కులం లేదు… మతం లేదు… నేను అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తిని అంటూ జనసేన అధినేత ఇచ్చే స్పీచ్ లు తెలియనివి కావు. అయితే వర్తమానంలో పవన్ నిజంగానే వాటిని పాటిస్తున్నారా? అంటే… పవన్ చెప్పే సిద్దాంతాలను ప్రశ్నించేలా ఓ వీడియో బయటకు వచ్చింది. ప్రముఖ మీడియా ఛానల్ ప్రసారం చేసిన ఓ కధనం, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ ను హాట్ టాపిక్ గా మార్చేసాయి.

హైదరాబాద్ లోని కాకతీయ హోటల్ లో ఆదివారం నాడు నిర్వహించిన ఓ సమావేశం ఇందుకు తావునిచ్చింది. కేవలం కాపు సామాజిక వర్గానికి చెందిన బిగ్ షాట్స్ తో పవన్ సమావేశం కావడం.., ఆ సమావేశంలో కులానికి ప్రాతినిధ్యం వహించేలా పవన్ వ్యాఖ్యలు చేయడం.., అంతేకాకుండా జనసేనకు భారీ విరాళాలు సేకరించడం వంటివి పవన్ నీతులను ప్రశ్నించేలా చేస్తోంది.

చిరంజీవి ‘ప్రజారాజ్యం’ విషయంలో ఏవయితే తప్పులు దొర్లాయో, సరిగ్గా అవే పవన్ కళ్యాణ్ విషయంలోనూ రిపీట్ అవుతుండడం… బహుశా గతం నుండి పాఠాలు నేర్చుకోలేదని అ’నిపించక మానదు. లేదా ప్రజారాజ్యం ఏ ఉద్దేశం అయితే స్థాపించారో, జనసేనను కూడా అదే ఉద్దేశంతో స్థాపించారన్న భావన ప్రజలలో వ్యక్తమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తానికి పవన్ నిజాయితీని ప్రశ్నించేలా సదరు మీడియా కధనం నిలిచింది.

కులాలపై అభిమానం చూపించే వాళ్ళంతా సహజంగా వాడే పదాలైన ‘మనోడు, మన రక్తం’ వంటి పదాలు పవన్ నోట రావడం బహుశా అభిమానులు కూడా ఊహించని విషయాలుగా పేర్కొనవచ్చు. దీంతో రాజకీయ ప్రత్యర్ధులకు తోడు, సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందే పవన్ బేరాలు మొదలుపెట్టారన్న విమర్శలకు తావిచ్చేలా ఈ సమావేశం నిలిచిందనేది ఈ కధనం సారాంశం.