Pawan Kalyan asks fans to register for voteఅభిమానుల అండదండలు, ఆదరణే ‘జనసేన’ ఆవిర్భావానికి ప్రధాన కారణం. అయితే ఆ అభిమానులే ఓటు వేయకపోవడంతో ఏకంగా రెండు ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ ఓటమి పాలు కావాల్సి వచ్చింది. అయితే నమ్ముకున్న ఫ్యాన్స్ ను తనను వమ్ము చేసారని అర్ధం చేసుకున్న పవన్ కళ్యాణ్, ఇటీవల కాలంలో తన అభిమానులను మార్చుకునే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు.

‘సీఎం సీఎం’ అంటూ వివిధ సందర్భాలలో అరుస్తున్న సమయంలో, ‘మీరు సీఎం అంటే నేను అయిపోను, వెళ్లి ఓట్లు వేస్తే అవుతాను, ముందు వెళ్లి ఓటును రిజిస్టర్ చేయించుకోండి’ అంటూ ఫ్యాన్స్ కు హితవు పలికారు. ‘జనసేన’ స్థాపించినప్పటి నుండి, 2019లో ఓటమి పాలయిన తర్వాత పవన్ కళ్యాణ్ లో వచ్చిన మార్పుకు నిదర్శనం ఇది.

అయితే తన అభిమాన హీరో చెప్పినా పవన్ కళ్యాణ్ అభిమానులు వినే దశలో లేరా? అంటే… ఏమో? నేడు జరిగిన సంఘటనలు చూస్తుంటే, ఒక సినీ హీరోగా మాస్ క్రేజ్ ను సొంతం చేసుకున్న పవన్ ను చూసేందుకు ఇష్టపడే అభిమానగణం, రాజకీయంగా పవన్ వ్యాఖ్యలను వినిపించుకునే విధంగా ఉన్నట్లు కనిపించడం లేదు.

తన కారులో ఓపెన్ టాప్ లో వస్తోన్న పవన్ కళ్యాణ్ ను ఏకంగా కిందికి తోసేసే అభిమానం నిజంగా ఎవరికి ఉపయోగం? ఈ ఉదంతంలో ఎలాంటి చేదు సంఘటన చోటు చేసుకోలేదు కాబట్టి, కేవలం సోషల్ మీడియాలో వైరల్ వరకు సరిపోయింది. కానీ ఇలాంటి అత్యుత్సాహమైన అభిమానం తాము ఎంతగానో అభిమానించే పవన్ కళ్యాణ్ కే చేటు చేస్తుందనే అవగాహనకు ఫ్యాన్స్ రాలేకపోతున్నారని చెప్పవచ్చు.

అలాగే మత్స్యకారుల అంశంపై ఎంతో సీరియస్ గా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే, వెనుక నుండి ‘సీఎం సీఎం’ అంటూ పవన్ ప్రసంగానికి అడ్డు తగిలే విధంగా స్లొగన్స్ ఇవ్వడం వలన నిజంగా పవన్ సీఎం అయిపోతారా? ఏ మాత్రం కనీస అవగాహన లేకుండా పవన్ ఫ్యాన్స్ రాజకీయంగా మెదులుతున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ అభిమానం ఇలాగే కొనసాగితే 2024లో మరోసారి జనసేనకు చేదు అనుభవం తప్ప, గౌరవప్రదమైన స్థానం దక్కదని గుర్తించాలి.

రాజకీయంగా అందరిని కలుపుకుపోతేనే జనసేన క్షేత్రస్థాయిలో బలపడుతుంది, పొలిటికల్ గా ఇంకా ఎదిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా బహిరంగ సభలలో ‘సీఎం సీఎం’ అంటూ అత్యుత్సాహం ప్రదర్శించే స్లోగన్స్ కేవలం సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి తప్ప, ఎందుకు ఉపయోగకరం కాదని తెలుసుకోవాలి. తాజా పరిణామాలతో తన అభిమానులను దిశానిర్ధేశం చేయడం పవన్ కళ్యాణ్ కు ఎంతో అవసరమని మరోసారి నిరూపణ అవుతోంది.