Pawan Kalyan as Brand Ambassador for Handloom industry in Andhra Pradesh and Telanganaచేనేత కార్మికుల దీనస్థితికి జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ చలించారు. తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు పవన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. తెలంగాణ చేనేత అఖిల పక్షం ఐక్య వేదిక, ఏపీ చేనేత కార్మిక సంఘం సభ్యుల బృందం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ ని కలిసి… తెలుగు రాష్ట్రాల్లోని చేనేత కార్మికుల ఆకలి చావులను పవన్ దృష్టికి తీసుకువచ్చారు.

వచ్చే నెలలో గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించనున్న ‘చేనేత సత్యాగ్రహం’ కార్యక్రమానికి రావాలని పవన్ ని ఆహ్వానించారు. అందుకు సమ్మతించిన పవన్, చేనేత కుటుంబాల కష్టాలను తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని, నేత కళను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, ‘చేనేత’కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని స్వచ్ఛందంగా పవన్ ప్రకటించారు. దీంతో చేనేత పరిశ్రమకు మునుపటి వైభవం లభిస్తుందేమోనన్న ఆశ వారిలో కనపడింది.

ఎవరూ పేరు కూడా తలవని ఉద్దనం కిడ్నీ రోగుల సమస్యల పరిష్కారానికి పవన్ నడుం బిగించడంతో, ఆ విషయం ఇపుడు కేంద్రం దాకా వెళ్ళింది. అలాగే ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చేనేత పరిశ్రమ కూడా పవన్ ఎంట్రీతో మళ్ళీ ఉజ్వల దశకు చేరుకుంటుందేమో చూడాలి. ఫిబ్రవరిలో మంగళగిరిలో జరగబోయే కార్యక్రమంతో దీనికి మరింత ప్రచారం లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు.