Pawan Kalyan announced one lakh to each families who diedకౌలు రైతు కుటుంబాలను జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదంటూ, ఉభయ గోదావరి జిల్లాలలో చనిపోయిన 80 మంది కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్, అతి త్వరలోనే ఆయా కుటుంబాలను నేరుగా వెళ్లి పరామర్శిస్తానని ప్రకటించారు.

మంగళగిరిలో జరిగిన ఆవిర్భావ సభ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న పవన్ వేసిన ప్రస్తుత అడుగు ఖచ్చితంగా వైసీపీ సర్కార్ గుండెల్లో గుబులు పుట్టించేదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే గతంలో ఇదే మాదిరి జగన్ చేసిన ‘ఓదార్పు యాత్ర’ అందరికి గుర్తుకు వస్తోంది.

పేరు ఏదైనా కాన్సెప్ట్ అయితే అదే కావడంతో, జగన్ రూట్ లోనే పయనించి ఆయన్నే దెబ్బకొట్టే విధంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనలు జనసైనికులలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. బహుశా ఈ యాత్ర నుండి పవన్ పూర్తి స్థాయి రాజకీయాలలోకి వచ్చి, మరో రెండేళ్ల పాటు యాక్టివ్ గా ఉంటారని పార్టీ వర్గీయులు కూడా ఆశిస్తున్నారు.

ఏది ఏమైనా పవన్ చేసిన ప్రకటన ‘లక్ష రూపాయల’ ఆర్ధిక సాయం కాదు, అంతకు మించి అన్నది సుస్పష్టమైంది. పార్టీని బలోపేతం చేయడానికి తీసుకున్న ఓ మంచి నిర్ణయంగా పొలిటికల్ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా పవన్ సొంత సామాజిక వర్గం ఎక్కువగా కొలువై ఉన్న ఉభయ గోదావరి జిల్లాలలో ఈ యాత్ర మొదలుపెడుతుండడం పార్టీకి సానుకూలమైన అంశం.

అయితే ఇది బీజేపీ ఇచ్చిన రూట్ మ్యాప్ లో భాగమా? లేక జనసేన అధినేత సొంతంగా తీసుకున్న నిర్ణయమా? అన్న ప్రశ్నలకు పవన్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. పార్టీ ఆవిర్భావ సభలో బీజేపీ రూట్ మ్యాప్ కోసం వేచిచూస్తున్నానని చెప్పిన పవన్, తదుపరి ఈ యాత్ర ప్రారంభిస్తుండడంతో, ఖచ్చితంగా ఈ ప్రశ్నలు వైసీపీ నుండి ఎదురవుతాయి.