pawan-kalyan-andhra-pradesh-special-statusఏపీకి ప్రత్యేక హోదా విషయమై ‘జనసేన’ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఘాటుగా స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావడం కష్టమని, ‘జల్లికట్టు’ కోసం తమిళనాడులో అందరూ ఏకతాటిపైకి వచ్చారని, అది లిమిటెడ్ సబ్జెక్ట్ అని అన్నారు. ‘రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేకహోదాపై పవన్ ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు నిద్రపోయారా?’ అంటూ సూటిగా ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ప్రధాని నరేంద్ర మోడీతో పవన్ కల్యాణ్ మాట్లాడాలని, తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు.

ప్రత్యేక హోదాపై ‘జనసేన’ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏం ఊహించుకుంటున్నారో తెలియదని, దీంతో ప్రయోజనం లేదని తెలిస్తే పవన్ ఇలా మాట్లాడరని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు విమర్శించారు. ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజ్ బాగుందని, చాలా రాష్ట్రాలకు ఇప్పటికే ప్రత్యేక హోదా ఉందని, దీని వలన ఏ రాష్ట్రాలు బాగుపడ్డాయో తెలియదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే లక్ష్యంగా పవన్ ట్వీట్స్ చేస్తుండడంతో… టిడిపి నేతలు, కేంద్ర మంత్రులు పవన్ కు కౌంటర్లు ఇస్తూ… జల్లికట్టుకు – స్పెషల్ స్టేటస్ కు ముడిపెట్టడం సమంజసం కాదని తెలియజేసే పనిలో ఉన్నారు.