Pawan Kalyan Anantapur Public Meeting Speechఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది… “జనాలు కష్టాలతో ఉన్నప్పుడే రాజకీయ నాయకులు సుఖపడేది” అని! అది ఎటకారంగా అన్నా, వెక్కిరింపుగా వ్యాఖ్యానించినా… అది నిజం. రాజకీయాలు అలా ఉన్నన్ని రోజులే ప్రస్తుత నేతలు మనుగడ సాగిస్తారు. ఇందుకు ఆ పార్టీ నేతలు, ఈ పార్టీ నేతలు అన్న భేదాభిప్రాయం లేదు. మరి అలాంటి నేతలకు ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తులు చేయడమనేది… పవన్ అమాయకత్వం క్రింద పరిగణించాలా? లేక మరో అవకాశం రాజకీయ నాయకులకు ఇస్తున్నారని అనుకోవాలా?

అనంతపురంలో ఉన్న కష్టాల గురించి సుదీర్ఘంగా పవన్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కరువు తట్టుకోలేక మహిళలు మానాలు కూడా అమ్ముకుంటున్నారన్న కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. అలాగే ఎప్పటి నుండో ఉన్న రైతు సమస్యలను ఏకరువు పెట్టారు. అనంతపురం కష్టాలకు పవన్ ఎంతలా స్పందించారంటే… తన పార్టీ తదుపరి కార్యాలయాన్ని ఇక్కడే స్థాపించడమే కాదు, సంస్థాగతంగా కూడా ఇక్కడ నుండే బలపరిచి, స్థానిక ప్రజల కష్టాలకు అండగా నిలబడతానని, అందరూ కలిసి వస్తే అనంతపురం కష్టాలను ఢిల్లీ స్థాయిలో ఏకరువు పెడతానని చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా అనంతపురంకు 100 టీఎంసిల నీటిని రాబట్టగలగడమే తన మొదటి లక్ష్యంగా చెప్పిన పవన్, ఆడపడుచులకు అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. ఈ 100 టిఎంసిల నీటి లక్ష్యం కోసం ఇతర పార్టీలు కూడా కలిసి వస్తే… ఎలా చేయాలి ఏం చేయాలన్న దానిపై చర్చలు జరిపి సఫలీకృతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక్కడే ‘జనసేన’ అధినేత పప్పులో కాలేసారని చెప్పక తప్పదు. నిజంగా ప్రస్తుత రాజకీయ నేతల్లో అంత చిత్తశుద్ధి ఉంటే, అనంతపురం జిల్లా ఈ పరిస్థితుల్లో ఉంటుందా? ప్రస్తుత పాలకప్రతిపక్షాలే కాదు, అంతకుముందు, ఆ ముందు వున్న వారు కూడా అంతే.

ఏదైనా చేయగలిగితే ఏ సత్యసాయిబాబా మాదిరో లేక ఇంకో వ్యక్తి మాదిరో పవన్ చేయాలే గానీ, ఈ రాజకీయ నేతలతో పెట్టుకుంటే… అసలు కార్యం కన్నా… “నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ” అని ఆరోపణలు చేసుకోవడానికే సమయం సరిపోతుంది. మరి అలాంటి నేతలతో కలిసి ప్రజా సమస్యలను పరిష్కరించడమంటే ఆంధ్రప్రదేశ్ కు “స్పెషల్ స్టేటస్” తెప్పించడమే అవుతుంది. అర్ధమైంది కదా… ఇది జరగదు… అది జరగదు..! కాబట్టి విజ్ఞప్తులు చేసి పిచ్చివాడయ్యే కన్నా, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ 2019 వరకు వేచిచూడడం మెరుగు కదా..!