pawan-kalyan-anantapur-public-meeting-name‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ నవంబర్ 10వ తేదీన అనంతపురంలో ఓ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇందు నిమిత్తం ఇప్పటికే ప్రభుత్వ కాలేజీకి ‘జనసేన’ అధినేత అనుమతి కావాలంటూ ఓ లేఖ కూడా రాసారు. తాజాగా ఈ సభకు నామకరణం చేస్తూ ‘జనసేన’ ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. ‘సీమాంధ్ర హక్కుల సభ’ పేర్కొన్న ఈ సభా ప్రాంగణానికి ‘తరిమెల నాగిరెడ్డి ప్రాంగణం’ అనే పేరును ఖరారు చేసారు.

పార్టీ పేరు మాదిరే, ఈ సభకు పెట్టిన పేరు కూడా బాగుంది. అయితే సీమాంధ్ర హక్కులు ఏంటి? అవి ఎలా రాబట్టాలి? వాటి కోసం పవన్ పోరాడతారా? అసలు పవన్ కు ఓ ప్రణాళిక అంటూ ఉందా? ఇలా అనేకానేక ప్రశ్నలు అనంతపురం సభపై కలుగుతున్నాయి. తిరుపతిలో పెట్టిన తోలిసభ గ్రాండ్ సక్సెస్ కావడంతో, కాకినాడ సభలో పవన్ ఏం చెప్తారా… ఏం చెప్తారా… ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా..? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు.

అయితే కాకినాడలో ‘జనసేన’ అధినేత అందరినీ నిరుత్సాహపరచడంతో… తాజా అనంతపురం సభపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, ప్రజల తరపున పోరాటం చేస్తానని చెప్తున్న పవన్ కళ్యాణ్, దానికి ఎప్పుడు ముహూర్తం ఖరారు చేస్తారు అన్నదే అందరి ఆసక్తి. అలా కాకుండా ఇలా సభలతో కాలయాపన చేస్తే, ప్రజల నుండి మద్దతు పొందడంలో పవన్ విఫలం కావచ్చనేది రాజకీయ విశ్లేషకుల మాట.