Pawan Kalyan Ananatpur Meeting Public Talk  వెండితెరపై ‘పవర్ స్టార్’గా పిలుచుకునే పవన్ కళ్యాణ్ అన్న పేరు యువతలో ఒక సెన్సేషన్. అలాంటి పవన్ తనకు నటనలో ఆనందం లేదని తేల్చిచెప్పారు. అయితే పవన్ ఇలా చెప్పడం ఇదే మొదటిసారి కాదు, గతంలోనూ చాలా సందర్భాలలో ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. తాజాగా అనంతపురం సభలో కూడా నటనపై ఆసక్తి లేదు, సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా పెద్దగా పట్టించుకోను అన్నారు. మరి ఎందుకు సినిమాలు చేస్తున్నారని అడిగితే మాత్రం… ఓ పెద్ద నవ్వు నవ్వుతూ ‘నా దగ్గర డబ్బులు లేవబ్బా…’ అంటూ జవాబు చెప్తారు.

మరి నిజంగానే పవన్ దగ్గర డబ్బులు లేవా? సరే పవన్ మాటనే నమ్ముతూ డబ్బులు లేవని అనుకుందాం. మరి దీనికి శాశ్వత పరిష్కారం ఏమిటి? ఇప్పుడంటే సినిమాలు చేస్తూ పార్టీని సంస్థాగతంగా నెలకొల్పాలని చూస్తున్నారు. మరి ఒక్కసారి ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత పూర్తి రాజకీయాల్లోకి వస్తే… సినిమాలు చేయడానికి అవకాశం దొరకదు. మరి అప్పుడు పార్టీ పరిస్థితి ఏమిటి? పూర్తిగా రాజకీయాల్లోకి రాక ముందు మహా చేయగలిగితే ఓ నాలుగు సినిమాలు చేస్తారు. ఒక్కో సినిమాకు 25 వేసుకున్నా, ఓ 100 మాత్రమే తీసుకోగలరు.

మరి ఆ 100తో పార్టీని ఎంతకాలం నడుపుతారు? పవన్ ముందడుగు వేయాలే గానీ, పార్టీకి ఆర్ధికంగా అండదండగా ఉండేందుకు చాలా మంది క్యూలో ఉన్న విషయం జనాలకు తెలియని విషయం కాదు. కావున ఇలాంటి మాటలు కట్టిపెట్టి, ఏది ఏమైనా పూర్తిగా రాజకీయాల్లోకి రావాలని అభిమానులతో పాటు, ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారు. సినిమాల ద్వారా ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి చాలా మంది నటులే ఉన్నారు. పవన్ లాగా చేయకపోవచ్చు గానీ, వెండితెరపై పవన్ కంటే గొప్పగా నటించేవారే ప్రస్తుతం మన ఇండస్ట్రీలో ఉన్నారు.

ఓ నటుడిగా పవన్ కే ఆనందం లేనపుడు దానిని విరమించుకుని, ఒక ప్రజా నాయకుడిగా తమ వద్దకు రావాలని ప్రజలు పిలుపునిస్తున్నారు. అయితే ఇదేదో చిరంజీవి మాదిరి మెగా అభిమానులు చేసే రొటీన్ హంగామా కాదు, మార్పు కోరుకుంటున్న ప్రజలు, సరికొత్త రాజకీయాలను కావాలంటున్న విశ్లేషకులు ‘జనసేన’ అధినేత సిద్ధాంతాలు నచ్చిన వారు ఆశిస్తున్న విషయం. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయకత్వంలో ప్రస్తుతం రాష్ట్రం సరైన దిశలోనే పయనిస్తోంది. అయితే రొటీన్ రాజకీయాల నుండి చంద్రబాబు బయట పడలేకపోతున్నారన్నది వాస్తవం. దీంతో మార్పు కోరుకుంటున్న ప్రజానీకం పవన్ కళ్యాణ్ ను ఒక అవకాశంగా భావించి సదరు అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.