appu ratna awardఆంధ్రప్రదేశ్‌ సిఎం జగన్మోహన్ రెడ్డిని మంత్రులు, వైసీపీ నేతలు పోటీలు పడుతూ ప్రతీరోజూ పొగుడుతూనే ఉంటారు కానీ ప్రతిపక్ష నేతలు మాత్రం ఎల్లప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు. కానీ తొలిసారిగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సిఎం జగన్మోహన్ రెడ్డి గొప్పదనం గుర్తించి ఆయనకి భారతరత్న వంటి గొప్ప అవార్డు ఏదైనా ఇవ్వాలని సూచించారు.

ఎడాపెడా అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు కనుక సిఎం జగన్‌కి “అప్పు రత్న” అవార్డు ఇవ్వాలని ట్విట్టర్‌లో సూచించారు.

అప్పులతో ‘ఆంద్ర’ పేరు మారుమ్రోగిస్తున్నందుకు, ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. వాటిని అలాగే కొనసాగించండి. గమనిక: మీ సొంత ఆస్తులు పెంచుకోవడం మరిచిపోవద్దు. రాష్ట్ర ఆస్తులు మరియు అభివృద్ధి కుక్కలపాలైనా పర్వాలేదు కానీ మీ సొంత ఆస్తులు మాత్రం పదిలంగా కాపాడుకోండి. ముఖ్యమంత్రి స్పూర్తి అంటే ఇదీ… !” అని పవన్‌ కళ్యాణ్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేస్తూ, ఓ చక్కటి కార్టూన్ కూడా దానికి జోడించారు. కేవలం 9 నెలల్లోనే రూ.55 వేల కోట్లు అప్పులు చేసి వైసీపీ సరికొత్త రికార్డ్ నెలకొల్పిందని దాని కింద వ్రాశారు.

ఏనుగు పైకి చూపే దంతాలు వేరు… ఆహారం నమిలి తినే దంతాలు వేరున్నట్లుగానే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న అప్పులు కూడా పైకి కనబడేవి కొన్ని… కనబడనివి అనేకం ఉంటాయని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. అది నిజమేనని నేడు రాజ్యసభలో కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి లిఖితపూర్వకంగా ధృవీకరించారు. ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌-అప్పులు కాకుండా కార్పొరేషన్ పేరిట తీసుకొనే అప్పులు, కాంట్రాక్టర్లకి చెల్లించాల్సిన బకాయిలు చాలానే ఉన్నాయని చెప్పారు. కనుకనే ఈ అవార్డుకి సిఎం జగన్‌ అన్ని విదాల అర్హుడని పవన్‌ కళ్యాణ్‌ సిఫార్సు చేస్తున్నట్లున్నారు.