Pawan Kalyan advise to fansతనకు స్వాగతం పలకాలన్న అభిమానుల అత్యుత్సాహం, వారి స్పీడ్ ను చూస్తుంటే తనకు చాలా భయంగా ఉందని ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ అనంత పర్యటనలో అభిమానులు గాయపడటం, తన కాన్వాయ్ కిందే పడి ఓ అభిమానికి తీవ్ర గాయాలు కావడాన్ని ప్రస్తావించిన ఆయన, ఈ తరహా చర్యలు వద్దని మృదువుగా హెచ్చరించారు.

నేడు ధర్మవరంలో మాట్లాడిన పవన్… తాను సినిమా ఫంక్షన్స్ ఎక్కువగా జరుపుకోనని, అభిమానులు నలిగిపోవడం తనకు ఇష్టం లేకనే ఫంక్షన్స్ కు దూరంగా ఉంటానని చెప్పారు. కానీ, ప్రజా సమస్యలను గురించి తెలుసుకునేందుకు ప్రజల్లోకి రాక తప్పదని, దీనివల్ల అభిమానులు ఇబ్బందులకు గురి కావడం తనకు ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.

కోట్ల మంది ప్రజల సమస్యలను ఇంట్లో కూర్చుంటే తెలుసుకోలేనని చెప్పిన పవన్ కల్యాణ్, తాను కూడా కొంత నలగాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అభిమానులు సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని, వారి తరువాతే అభిమాన హీరో అనుకోవాలని హితవు పలికారు.

వేగంగా, అత్యుత్సాహంతో రావద్దని, సంతోషంగా, నెమ్మదిగా రావాలని పిలుపునిచ్చారు. ఎవరికి ఏమైనా ఓ అన్నగా తనకు బాధ కలుగుతుందని, తనకు ఎటువంటి వేదనను కలిగించవద్దని వేడుకుంటున్నానని చెప్పారు. భవిష్యత్తులో చేయాల్సి ఉన్న పర్యటనల నేపధ్యంలో ఫ్యాన్స్ ను గాడిలో పెట్టేందుకు పవన్ నిర్ణయించుకున్నట్లుగా కనపడుతోంది.

గడచిన పది రోజులుగా మాట్లాడి, మాట్లాడి తన గొంతు ఎండుకు పోయిందని అన్న పవన్ కల్యాణ్, తన గొంతు నుంచి రక్తం వచ్చేంత దగ్గుతున్నానని కూడా పవన్ చెప్పారు. జనసేన పార్టీ చేనేత కార్మికులకు అండగా ఉంటుందని, తాను మనస్ఫూర్తిగా, చిత్తశుద్ధిగా ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసమే తొలి దశ పర్యటన సాగిస్తున్నానని, అన్ని సమస్యల పరిష్కారాలనూ తన మేనిఫెస్టోలో చేరుస్తానని అన్నారు.

అందుకు తనకు కొద్ది రోజుల సమయం కావాలని, పవర్ లూమ్స్ కు తాను వ్యతిరేకిని కాదని, వాటి వల్ల కార్మికులు, చేనేత కళాకారుల వృత్తి నైపుణ్యం అంతరించి పోకుండా చూడాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. ఈ మేరకు సమస్యలు ఎక్కడ ఉన్నాయో తనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ధర్మవరానికి చేనేత బ్రాండ్ ను తెచ్చే బాధ్యత తనదేనని, నేతన్న కన్నీరు తుడిచి, వారికి అండగా ఉంటానని పవన్ స్పష్టం చేశారు.

విదేశాల్లో వృత్తి కళాకారులకు ప్రాధాన్యత ఎంతో ఉందని, విదేశాల నుంచి డిజైన్లు తెచ్చి, వాటిని ఇక్కడ నేయాలని సూచించారు. తన పర్యటనకు ప్రజల నుంచి ఎంతో స్పందన వచ్చిందని, చాలా మంది ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు తమ ఇంటికి రావాలని ఆహ్వానించారని, సమయాభావం వల్ల వెళ్లలేకపోయానని అన్నారు. ఇలా మాట్లాడుతున్న సమయంలో పలుమార్లు పవన్ కల్యాణ్ కు దగ్గు రాగా, జనసేన కార్యకర్తలు మంచినీళ్లు అందించారు.