pawan kalyan about ycp congress leaders“ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే” అని మొదట నుండి చాలా బలంగా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం బీజేపీ దగ్గర మాట తీసుకున్నానని, ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిగా ఖచ్చితంగా ఉంటుందని హామీ ఇవ్వడంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే.

ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంలో కూడా గతంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అంతలా అమరావతిని రాష్ట్ర రాజధానిగా తీసుకున్న పవన్ కళ్యాణ్, తాజాగా ఆవిర్భావ సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. నాడు చంద్రబాబు అసెంబ్లీలో చట్టం చేస్తున్న సందర్భంలో గానీ, భూములు సేకరిస్తున్న సమయంలో గానీ వైసీపీ నేతలు ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేయలేదంటూ నిలదీసారు.

తనకు కొన్ని విషయాలలో ఇబ్బందికరంగా అనిపించినపుడు పెనుమాకలో ఒకసారి, ఉద్దండరాయుని పాలెంలో మరోసారి పర్యటించి, అక్కడ రైతుల సమస్యలు అడిగి తెలుసుకుని ప్రభుత్వంపై పోరాటం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసారు. ఒక్క సీటు కూడా లేని తానే అంత చేసినపుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నపుడు మీరేం చేశారు? “గాడిదలా కాస్తున్నారు మీరు ఆ రోజున?” అంటూ తీవ్ర పదజాలంతో మండిపడ్డారు.

ఆ రోజున మీ బుర్ర ఎక్కడుంది? బుద్ధి ఏమైంది? గాడిదలు కాసే పనులు మీరు… ఆ రోజునే మూడు రాజధానులని చెప్పి ఉండొచ్చు కదా. మీ వైసీపీ నేత ‘ర్యాంబో’ రాంబాబు గారి అమ్మాయి పెళ్ళికి పిలిచినప్పుడు, కనీసం అప్పుడైనా చెప్పి ఉండొచ్చు కదా, మాకు ఇష్టం లేదని. బిడ్డ పెళ్ళికి పిలిచిన వ్యక్తులు, ఆ రోజున మూడు రాజధానుల గురించి ఎందుకు మాట్లాడలేదు. పైగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి 32 వేల ఎకరాలు కాదు, ఇంకో వెయ్యి ఎకరాలు అదనంగా ఇవ్వమన్నారు.

29 గ్రామాలు… 34 వేల ఎకరాలు… 32 శాతం మంది ఎస్సీ,ఎస్టీలు, మిగిలిన వారు బీసీ, ఓసీలు. నాడు ఎస్సీ, ఎస్టీ వర్గాల భూముల కోసం ఉద్దండరాయునిపాలెంలో నేను మద్దతు ఇచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించినపుడు, ప్రతిపక్షంలో ఉన్న మీకేమైంది? ఆషామాషీగా ఉందా మీకు? 3000 కోట్లు పైచిలుకు ఖర్చు పెట్టిన తర్వాత రాజధాని మారుస్తామంటే ఎవడబ్బ సొమ్ము ఇది. మీ ఇష్టానికి అమ్మేస్తారా? మీ ఇష్టానికి మార్చేస్తారా? అడిగేవాడు లేకపోతే మీరు ఏదైనా చేస్తారా? అంటూ ప్రస్తుత అధికార పార్టీ తీరును సూటిగా నిలదీశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే, ఎక్కడికి వెళ్ళదు. మీ కష్టం, మీ మీద పడిన లాఠీ దెబ్బ నా మీద పడినట్లే. గుర్తు పెట్టుకోండి. నేను మరోసారి ఖచ్చితంగా చెప్పగలను, రాజధానిగా అమరావతి ఇక్కడి నుండి కదలదు. అలా అని మరో ప్రాంత అభివృద్ధికి జనసేన అడ్డు కాదు అంటూ జనసేన అజెండాను తెలిపారు. అమరావతి నేపధ్యంలో న్యాయవ్యవస్థను కూడా తప్పుపట్టే స్థాయికి వైసీపీ దిగజారిపోయిందని దుయ్యబట్టారు.