Pawan Kalyan-Telangana Elections 2018జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం చెప్పినట్టే తెలంగాణ ఎన్నికలపై జనసేన అభిప్రాయాన్ని కాసేపటి క్రితం ట్విట్టర్ లో వెల్లడించారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయం చెప్పిన నాటి నుండి తెరాసకు ఆయన మద్దతు ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్ ఉన్న మహాకూటమికి మద్దతు ఇచ్చే అవకాశం లేకపోవడంతో తెరాస కే జనసేన మద్దతు ఉంటుందని చెప్పడం పెద్ద కష్టమేమి కాదు. అయితే పవన్ కళ్యాణ్ చివరి నిముషంలో తుస్సు మనిపించారు.

ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా తెలంగాణకు చక్కని పాలన, తక్కువ అవినీతి, పారదర్శకత ఇవ్వగలిగే పార్టీకే ఓటు వెయ్యాలని పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులను కోరారు. ఒకదశలో స్పష్టమైన దిశానిర్దేశం చేద్దామని అనుకున్నా లగడపాటి రాజగోపాల్ సర్వే మహాకూటమికి అనుకూలం అని చెప్పడంతో ఆయన వెనక్కు తగ్గారని సమాచారం. తెలంగాణాలో తెరాస గెలిచినా జనసేనకు ఒనగూరే ప్రయోజనం తక్కువ.. కేవలం చంద్రబాబును దెబ్బ కొట్టడానికి తెరాసకు మద్దతు ఇవ్వాలి.

అయితే తెరాసకు మద్దతు ఇచ్చి ఆ పార్టీ ఓడిపోతే ఆయన క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశం ఉండటంతో వెనక్కు తగ్గారు. మోత్కుపల్లి నరసింహులు ఇంకో ఇండిపెండెంటుకు మద్దతు ఇస్తారని ప్రచారం జరిగినా అది కూడా అవ్వలేదు. దీనితో వైకాపా తీసుకున్న ‘జీరో స్టాండు’ పవన్ కళ్యాణ్ కూడా తీసుకున్నట్టు అయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ ఆంతర్యం తమకు తెలుసని తెరాసకే తమ ఓటు అని కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు అనడం విశేషం. 7వ తారీఖున తెలంగాణలో పోలింగ్ జరగబోతుంది. 11న ఫలితాలు విడుదల అవుతాయి.