pawan kalyan about party allianceజనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ మరోమారు తన పార్టీ వైఖరిని స్పష్టంగా చెప్పారు. నంద్యాల జిల్లా, శిరెవెళ్ళ మండలంలో ఆదివారం జరిగిన సభలో మాట్లాడుతూ, “మా పార్టీ లక్ష్యం ఒక్కటే. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి, ప్రజల కష్టాలు తీర్చడం. ఏపీకి, ప్రజలకి ఈ దుస్థితి కల్పించిన వైసీపీని వచ్చే ఎన్నికలలో గద్దె దించడం చాలా అవసరం. కనుక వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు జనసేన కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకోవడానికి సిద్దం. ప్రజల కోసం ఎటువంటి త్యాగాలకైనా మా పార్టీ సిద్దం.

సింహం సింగిల్‌గా వస్తుందా మేము దానిని గుంపుగా ఎదుర్కొంటామా? అనే మాటలు చెప్పుకోవడానికి గొప్పగా ఉంటాయేమో కానీ వాస్తవ పరిస్థితులు వేరేగా ఉన్నాయని అధికార పార్టీ నేతలు గ్రహిస్తే మంచిది. వైసీపీ ప్రభుత్వం చక్కగా పనిచేస్తే జనసేన ఈవిదంగా పోరాడవలసిన అవసరం వచ్చేది కాదు కదా?రాష్ట్రంలో ప్రజలు సమస్యలతో అల్లాడుతుంటే రాష్ట్రాన్ని, ప్రజలను గాలికొదిలేసి వైసీపీ మంత్రులు ప్రతిపక్షాలను నిందిస్తూ కాలక్షేపం చేస్తూ చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు.

గతంలో జనసేన, టిడిపి, బిజెపిలు కలిసి పనిచేశాయి. ప్రస్తుతం జనసేన, బిజెపిలు కలిసి పనిచేస్తున్నాయి. భవిష్యత్‌లో ఎవరెవరు కలుస్తారో నేను ఇప్పుడే చెప్పలేను కానీ ఒక్కటి మాత్రం ఖాయం. ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితులలో చీలిపోనీయము. వైసీపీని గద్దె దించాలంటే అందరూ కలిసి పనిచేయక తప్పదు,” అని పవన్ కళ్యాణ్‌ అన్నారు.

పవన్ కళ్యాణ్‌ మాటలను బట్టి టిడిపితో పొత్తులకి జనసేన సిద్దమని, బిజెపి కూడా కలిస్తే మంచిదని సూచిస్తున్నట్లు అర్దమవుతోంది. ఒకవేళ బిజెపి అందుకు అంగీకరించకపోతే దానితో స్నేహం వదులుకోవడానికి కూడా వెనకాడనని చెప్పినట్లు అర్దమవుతోంది.

టిడిపి కూడా జనసేనతో పొత్తులకు సానుకూలంగానే ఉందని ఆ పార్టీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. ఆ రెండు పార్టీలు దగ్గరవుతున్నాయని వైసీపీ కూడా గ్రహించింది. టిడిపి, జనసేనలను దూరంగా ఉంచేందుకే ‘సింహం సింగిల్‌గా వస్తుందనే…’ పాచిపోయిన డైలాగ్‌ను వైసీపీ మంత్రులు పదేపదే చెపుతున్నారు.

కనుక రాబోయే కురుక్షేత్ర మహాసంగ్రామానికి వైసీపీ, టిడిపి, జనసేన మూడు పార్టీలు సిద్దం అయినట్లే. ఇక జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలే తాము ఏ గట్టున ఉండాలో తేల్చుకోవలసి ఉంది.