Pawan Kalyan about his first loveఒక నాయకుడికి పరిపక్వత ఎంత ఎక్కువ మోతాదులో ఉంటే, అంత త్వరగా, అంత వేగంగా నాయకుడిగా ఎదిగి ప్రజల మనిషి అవుతాడు. అలా అవ్వాలని కోరుకుంటోన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆ పరిణితి బాగా లోపిస్తోందన్న విషయం తేటతెల్లమవుతోంది. ఓ పక్కన బిజెపితో కలిసిపోయాడన్న రాజకీయ విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళ్ళగా, మరో పక్కన వ్యక్తిగత జీవితంపై కూడా బోలెడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అవునన్నా… కాదన్నా… పవన్ మూడు వివాహాల వ్యవహారం ఖచ్చితంగా ప్రత్యర్ధి రాజకీయ వర్గాలు ఏదొక సమయంలో ఎక్కుపెట్టే అంశమే. అయితే ఆ టైం కోసం వేచిచూడడం వివేకవంతుల లక్షణం. ఇది చాలదన్నట్లు… కొత్తగా తన ‘ఫస్ట్ లవ్’ మ్యాటర్ అంటూ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పంచుకోవడం చర్చనీయాంశం అయ్యింది. అదేదో గొప్ప విషయం తాను పంచుకుంటున్నానని అనుకుంటున్నారో ఏమో గానీ, ప్రస్తుతం పవన్ ‘ఫస్ట్ లవ్’ హాట్ టాపిక్ గా హల్చల్ చేస్తోంది.

మద్రాసులో కంప్యూటర్ క్లాసులకు వెళ్లే రోజుల్లో… తనతో పాటు వచ్చే ఓ అందమైన అమ్మాయిని ఆయన ప్రేమించారట. కంప్యూటర్ క్లాసులు సాగుతున్న కొద్దీ ఇద్దరి మధ్య చనువు పెరిగిందట. తన ఫ్రెండ్స్ అందరూ ఇది స్నేహం కాదని, ప్రేమేనని చెబుతూ, త్వరగా మనసులోని మాటను చెప్పేయాలని పవన్ ను తొందర పెట్టారట. దీంతో ఓ మంచి ముహూర్తం చూసుకుని, ఇంట్లో ఎవ్వరూ వాడకుండా పక్కన పడేసిన డొక్కు కారు దుమ్ము దులిపి, దాన్ని వేసుకుని వెళ్లిన పవన్, ఆమెకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి, కారు ఎక్కించుకున్నారట.

మధ్యలో ఓ చోట కారు ఆపి, తన మనసులోని మాటను చెప్పేయగా, అంతా విన్న ఆ అమ్మాయి, ఈ వయసులో ప్రేమేంటి? అసలు ప్రేమంటే ఏమనుకుంటున్నావ్? అంటూ క్లాస్ పీకిందట. ఆ సమయంలో తను ఓ టీచర్ మాదిరిగా తన కంటికి కనిపించిందని తన తొలిప్రేమ విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. అసలే మూడు పెళ్ళిళ్ళుపై సెటైర్లు విపరీతంగా పడుతున్న తరుణంలో… మళ్ళీ ‘ఫస్ట్ లవ్’ అంటూ చెప్పడం, బహుశా పవన్ కు ఏది చెప్పాలో, చెప్పకూడదో అస్సలు తెలియడం లేదనే భావించాలి.

ఓ సినీ హీరోగా ఇలాంటి కధలు ఎన్ని చెప్పినా, అవి అభిమానులకు, వీక్షకులకు కాస్త వినోదంగా అందించేవిగా ఉంటాయి. కానీ ఓ పార్టీ అధినేతగా, అందులోనూ ముఖ్యమంత్రి కావాలన్నా తపన ఉన్న వ్యక్తిగా పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం… అది చిన్నపిల్లల చేష్టలు లాగానే ఉంటాయి తప్ప, ఏ మాత్రం ఉపయోగం ఉండదని గుర్తించాలి. ఇది ‘ఫస్ట్ లవ్’ అంటే, ఇంకెన్ని లవ్ లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పడుతున్న సెటైర్లకు కొదవలేదు. ఆ అవకాశాన్ని పుట్టినరోజు నాడు స్వయంగా పవనే కల్పించారు మరి!