pawan-kalyan-20-years-completedమెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా వెండితెరకు పరిచయమైన పవన్ కళ్యాణ్ 20 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. మరి ఈ ఇరవై ఏళ్ళల్లో చిరు సోదరుడిగా పవన్ సాధించింది ఏంటి? అంటే… దానికి సమాధానం ‘చాలానే’ అని వస్తుంది. భారీ అంచనాల నడుమ వచ్చిన పవన్, తొలినాళ్ళల్లో మెగా అభిమానులను ఆకట్టుకోనప్పటికీ, అంచలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు.

ఒక సాధారణ పవన్ కళ్యాణ్ గా ఇండస్ట్రీలోకి వచ్చి, ప్రస్తుతం టాలీవుడ్ కు ‘పవర్ హబ్’గా మారిపోయారు. అవును… ప్రస్తుతం ఏ యువహీరో అయినా పవన్ జపం చేయాల్సిందే… అనేటంతగా ప్రభావం చూపడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో అంతా మెగాస్టార్ నామ జపం చేసేవారు, కానీ ప్రస్తుతం మెగాస్టార్ ఉండగానే, పవన్ నామ జపం చేస్తున్నారంటే… ఏ విధమైన ప్రభావం చూపించాడో అర్ధం చేసుకోవచ్చు. అయితే, ఇదేదో ఒక్క రోజులో జరిగింది కాదు.

దినదినాభివృద్ధిగా సాగిన పవన్ ప్రస్థానంలో… మిగతా హీరోలు సాధించలేని విషయాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా పవన్ లో ఎక్కువ మార్కులు కొట్టే అంశం ‘వ్యక్తిత్వం.’ అన్ని రసాలను అద్భుతంగా పలికించడంలో పవన్ నటన అందరినీ మెప్పించకపోవచ్చు గానీ, పవన్ వ్యక్తిత్వం మాత్రం ఆయనకు విశేషమైన సంఖ్యలో అభిమాన గణాన్ని తెచ్చిపెట్టింది. అదే ఇతర హీరోల నుండి పవన్ ను వేరుచేసింది. ఎంతగా వేరుచేసింది అంటే… ఏకంగా ఒక రాజకీయ పార్టీని పవన్ స్వయంగా నడిపించుకునేటంత..!

‘పవర్ స్టార్’ నుండి ‘జనసేన’ అధినేతగా మారిన వైనం అందరికీ ఆదర్శప్రాయం. అలాగే ఒక సినీ ‘వారసుడి’గా ఎంట్రీ ఇచ్చి, ఆ ‘వారసత్వం’ అనే మాటను మరిచిపోయేటంతగా పవన్ ప్రభావం ప్రేక్షకులపై పడింది. పవన్ సినీ రంగ ప్రవేశం చేసి 20 ఏళ్ళు గడిచిన ఈ సందర్భంలో… తదుపరి 20 ఏళ్ళల్లో పవన్ గమ్యం గురించి చర్చించుకోవలసిన పరిస్థితి తలెత్తింది. రాజకీయాల్లో సమూల మార్పు కోసం తన జీవితాన్ని కేటాయిస్తానని, రాబోయే తరం కోసమే తన రాజకీయ జీవితం అంకితమంటూ పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇవేమీ మాటలకే పరిమితం కాకుండా, చేతల్లో కార్యరూపం దాల్చాలని, పవన్ కళ్యాణ్ అనే పేరు చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలుగు రాష్ట్రాలను తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా ఆశిద్దాం.