pawan kalan party alliance 20204 electionజనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ శనివారం మంగళగిరిలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కులాలు, పొత్తులు, కోనసీమ అల్లర్లు వగైరా చాలా అంశాలపై పూర్తి స్పష్టతతో మాట్లాడారు.

ముందుగా చెప్పుకోవలసింది పొత్తుల గురించే. “వచ్చే ఎన్నికలలో మన ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. 1. బిజెపితో ముందుకు సాగడం. 2. బిజెపిని కూడా కలుపుకొని టిడిపితో వెళ్ళడం. 3. జనసేన ఒంటరిగా వెళ్ళడం.

ఏ పార్టీతో పొత్తులు పెట్టుకొన్నా మళ్ళీ జనసేనను త్యాగం చేయమంటే కుదర్దు. తప్పనిసరిగా మనకు తగినన్ని సీట్లు ఇస్తేనే పొత్తులు లేకుంటే లేదు. ప్రతీసారి ఎన్నికలలో మనమే తగ్గుతున్నాము. ఈసారి మనం తగ్గేదేలే. వాళ్ళు కూడా తగ్గాల్సి ఉంటుంది. తనను తాను తగ్గించుకొనేవాడే హెచ్చింపబడునని బైబిల్‌లో చెప్పిన సూక్తిని మేము త్రికరణ శుద్ధిగా పాటిస్తున్నాము. ఇప్పుడు ఎదుటవాళ్లు కూడా పాటించాలని కోరుతున్నాం.

అయితే పొత్తుల గురించి ఆలోచించడానికి ఇంకా చాలా సమయం ఉంది కనుక కార్యకర్తలు ఎవరూ పొత్తుల గురించి సీరియస్‌గా తీసుకొని వేరేగా భావించకండి,” అని అన్నారు.

ఇక కులాల గురించి మాట్లాడుతూ, “అందరూ కులాల నిర్మూలన అంటూ మాట్లాడుతుంటారు. కానీ కులాల పేరుతో కార్పొరేషన్లు పెట్టేసి ప్రజలను చీల్చేసి ఓట్లు దండుకొంటుంటారు. మనం వినే మాటలకి జరుగుతున్న వాటికి ఎక్కడా పొంతన లేని ఓ నకిలీ ప్రపంచంలో జీవిస్తున్నాము.

ఆంధ్రా అనే పదం కంటే కులం అనే పదానికే ప్రజలు ఎక్కువగా స్పందిస్తుండటం చాలా బాధాకరం. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కంటే మనకు కుల ప్రయోజనాలే ఎక్కువయిపోయాయని ఇది సూచిస్తోంది. అయితే ఈ కులాల మద్యనే మనం జీవించాలి. అలాగని కులాల పేరుతో వేర్వేరుగా లెక్కలు కట్టుకోవడంకంటే అన్ని కులాలవారిని కలుపుకొని పొగలిగితే బాగుంటుంది కదా?అదే మన పార్టీ సిద్దాంతం కూడా.

కమ్మవారిని వైసీపీ తన రాజకీయ వర్గ శత్రువుగా భావిస్తోంది. అలాగే కాపులందరూ జనసేనవైపు ఉన్నారు కనుక వారినీ శత్రువులుగా జమకట్టేసింది. రఘురామ కృష్ణరాజు కారణంగా క్షత్రియులను వర్గ శత్రువుగా భావించడం మొదలుపెట్టింది. అలాగే రేపు మరొకరు… మరొకరి కారణంగా ఆయా కులాలను కూడా వైసీపీ శత్రువుల జాబితాలో చేర్చేసినా ఆశ్చర్యం లేదు. అయితే ఇలా కొందరు వ్యక్తులతో శతృత్వం కారణంగా ఆ కులస్తులందరినీ ద్వేషించడాన్ని ఏమనుకోవాలి?” అని పవన్ కళ్యాణ్‌ ప్రశ్నించారు.

కోనసీమ అల్లర్ల గురించి మాట్లాడుతూ, “వాటితో జనసేన పార్టీకి అసలు సంబందమే లేదు. అసలు మనం ఒక్క మాట మాట్లాడకపోయినా మనల్ని కూడా అందులోకి లాగి ముద్రవేసేశారు. నిజానికి కోనసీమ అల్లర్లు వైసీపీ స్వయంగా పక్కా ప్రణాళికతో అమలుచేసినవే. చివరికి ఆ అల్లర్లలో వారి సొంత మంత్రి (విశ్వరూప్)ని కూడా బాధితుడిగా చేసేశారు.

కోనసీమ అల్లర్లతో జనసేనకు ఏదో జరిగిపోతుందని అనుకొంటే అంత కంటే పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. జనసేన ఎటువంటి పార్టీయో అందరికీ తెలుసు. జనసేన అందరిని కలుపుకుపోతూ అందరూ బాగుండాలని కోరుకొంటుందే తప్ప ఎన్నడూ ఇటువంటి విధ్వంసాలకు పాల్పడదు. ఈ విషయం కోనసీమ ప్రజలకు కూడా తెలుసు,” అని పవన్ కళ్యాణ్‌ అన్నారు.