pawan-kalyan‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా తర్వాత ఏర్పడిన అనూహ్య పరిణామాల నేపధ్యంలో… కొత్త సినిమాను వాయిదాలు పడుతూ వస్తుండగా… ఈ లోపున ఏపీలో ‘ప్రత్యేక హోదా’ పేరుతో రాజకీయ వేడి రగలడంతో ఇప్పటివరకు మరో సినిమాను ప్రారంభించలేకపోయారు. అయితే డిసెంబర్ వరకు ఎలాంటి రాజకీయ ఊసు లేకుండా, కొత్త సినిమాను పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరో పది రోజుల్లో రంగంలోకి దూకనున్నారు.

‘గోపాల గోపాల’ ఫేం డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20వ తేదీ నుండి ప్రారంభం అవుతుండగా, పవన్ కళ్యాణ్ మాత్రం 24వ తేదీ నుండి షూటింగ్ లో పాల్గొననున్నారు. “కాటమరాయుడు” టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు పవన్ కళ్యాణే స్వయంగా కధను అందిస్తున్నారు. ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఫలితం తర్వాత పవన్ సొంత కధలకు దూరంగా ఉండడం మంచిదన్న సినీ విశ్లేషకుల అభిప్రాయాలను పక్కనపెడుతూ మరోసారి తన సొంత కధతోనే ముందుకు వెళ్తుండడం విశేషం.

‘సర్ధార్’ నిర్మాత శరత్ మరార్ మళ్ళీ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను భుజాన వేసుకోగా, ‘గోపాల గోపాల’ ఫేం అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నారు. ఫ్యాక్షనిజం నేపధ్యంలో ఈ కధను పవన్ తయారు చేసుకున్నట్లుగా గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ‘కాటమరాయుడు’ అనే టైటిల్ ను ఖరారు చేసారని టాక్. అయితే పవన్ సినిమాకు ఉండే క్రేజ్ కు ఇలాంటివేమీ అడ్డు కాబోవు.