Pattabhiram Kommareddyసిఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య జరిగి నాలుగేళ్ళు గడిచిపోయాయి కానీ ఆయనను హత్య చేసిన దోషులకు శిక్షలు పడేలా చేయకపోగా వారిని బెయిల్‌పై పైకి తీసుకువచ్చారని టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. మంగళగిరిలో టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగదని గుర్తించిన వివేకా కుమార్తె ఈ కేసును పొరుగు రాష్ట్రానికి తరలించాలని సుప్రీంకోర్టులో కోరారని అన్నారు.

ప్రతీ చిన్న అంశంపై తీవ్రంగా స్పందించే వైసీపీ నేతలు ఈ కేసులో సిఎం జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందన్నట్లు సోషల్ మీడియాలో అనేక విమర్శలు వినిపిస్తున్నా ఎందుకు స్పందించడం లేదని పట్టాభిరామ్ ప్రశ్నించారు. ఒకవేళ జగన్ స్పందించదలచుకోకపోతే సలహాదారుగా పెట్టుకొన్న సజ్జల రామకృష్ణారెడ్డి చేత అయినా ఆ ఆరోపణలకు సమాధానం చెప్పించవచ్చు కదా? అని పట్టాభి ప్రశ్నించారు.

కానీ వివేకా హత్యకేసులో వైసీపీ అధినేత, పార్టీ నేతల మౌనం సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్న ఆ అనుమానాలు నిజమని ధృవీకరిస్తున్నట్లున్నాయని పట్టాభి అన్నారు. ఈ సందర్భంగా ఆయన వివేకా హత్యకు సంబందించి ప్రశ్నలు సందించి, వాటికి జగన్ లేదా సజ్జల గానీ జవాబులు చెప్పాలని సవాల్ విసిరారు.

1. వివేక హత్య జరిగితే గుండెపోటుతో చనిపోయారని ఎలా చెప్పారు?

2. వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించేందుకు ఆయనకు గజ్జల జయప్రకాష్ రెడ్డి అనే కాంపౌండర్ చేత కుట్లు వేయించి, బ్యాండేజీలు కట్టించిన మాట వాస్తవమా కాదా?

3. జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 2 వారాలకే అడిషనల్ డీజీ స్థాయిలో సిట్ విచారణను రద్దు చేసి, ఎస్పీ స్థాయిలో సిట్ ఎందుకు వేశారు? కేసును నీరుగార్చడానికే కదా?

4. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి మీరు ముఖ్యమంత్రి అయిన నెలరోజులకే బెయిల్‌ ఎలా వచ్చింది? ఆయనపై ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదు? బెయిల్‌పై బయటకు తీసుకువచ్చే ఉద్దేశ్యం ఉంది కనుకనే ఆయనపై ఛార్జ్ షీటు వేయలేదని ప్రశ్నకు మీ జవాబు ఏమిటి?

5. కడప ఎంపీ అవినాష్ రెడ్డి గ్యాంగ్ ఘటనాస్థలంలో సాక్ష్యాధారాలను తుడిచివేయాలని ప్రయత్నించిందని బయటపెట్టిన సిఐ శంకరయ్య, మాట మార్చి సీబీఐ మీద ఎందుకు కేసు పెట్టారు?

6. ఈ కేసులో కీలక సాక్షులు కెశ్రీనివాస్ రెడ్డి (2019 సెప్టెంబర్‌2), గంగాధర్ రెడ్డి (2022, జూన్9)న అనుమానాస్పద పరిస్థితులలో చనిపోయారు. వారిని ఎవరు హత్య చేశారు? దానిపై పోలీసుల విచారణ జరిపారా లేదా? ఆ నివేదిక ఎక్కడుంది ఇప్పుడు?

7. ఈ కేసులో ఏ-4 నిందితుడిగా రిమాండ్ ఖైదీగా ఉన్న శివారెడ్డిని కడప రిమ్స్ హాస్పిటల్‌లో సకల సౌకర్యాలు ఎందుకు కల్పిస్తున్నారు?

ప్రతిపక్షాలపై కేసులు బనాయించడానికి గంటల వ్యవదిలోనే దర్యాప్తు పూర్తి చేసి కేసులు నమోదు చేసే ఏపీ పోలీసులు ముఖ్యమంత్రి సొంత బాబాయి వివేకా హత్యకు గురైతే నాలుగేళ్ళు గడిచినా ఇంతవరకు దోషులకు శిక్షలు పడేలా చేయలేకపోయారంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది కదా? పట్టాభి సంధించిన ఈ ప్రశ్నలకైనా వైసీపీ నేతలు సమాధానాలు చెప్పగలరో లేదో చూడాలి.