Pattabhi Ram comments on liquor bonds issue  ఆంధ్రప్రదేశ్‌ బివరెజస్ కార్పొరేషన్ రూ.2,000 కోట్లు నిధుల సమీకరణ కోసం బాండ్లు జారీ చేస్తే ఏకంగా రూ.8,000 కోట్లు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏపీలో మద్యం అమ్మకాలు రూ.9,000 కోట్ల నుంచి రూ.18,000కి పెరగడంతో మున్ముందు మరింత పెరుగుతాయనే నమ్మకంతో పెట్టుబడిదారులు ఈ బాండ్స్ కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు.

దీనిపై టిడిపి సీనియర్ నేత పట్టాభి రామ్, ఓ న్యూస్ ఛానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, “ఆనాడు మా ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం రూ.2,000 కోట్ల నిధుల సేకరణకు వెళ్ళినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి… చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తున్నారంటూ గోలగోల చేశారు. కానీ ఇప్పుడు ఆయనే లిక్కర్ బాండ్స్ ద్వారా రూ.8,000 కోట్లు అప్పు తెచ్చి ప్రజల నెత్తిన పెట్టారు.

బ్యాంకులు, పోస్టాఫీసులలో ఫిక్స్ డిపాజిట్లపైన గరిష్టంగా 6.6 శాతం మాత్రమే వడ్డీ ఇస్తుండగా, ఏపీ ప్రభుత్వం ఏకంగా 10.52 శాతం వడ్డీ ఇచ్చేందుకు సిద్దపడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పుడు లిక్కర్ బాండ్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం రేపు గంజాయి బాండ్స్, తరువాత హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాల బాండ్స్ కూడా విడుదల చేసినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఏపీ మద్యాంద్ర ప్రదేశ్ రాష్ట్రంగా మార్చేశారు. రేపు గంజాయి సాగును కూడా చట్టబద్దం చేసి యావత్ ప్రపంచానికి గంజాయి సరఫరా చేసే ఏకైక రాష్ట్రంగా నిలుపుతారేమో?

తనకు ఎన్నికల మ్యానిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీత వంటిదని, దానికి విరుద్దంగా ఏ ఒక్క పనిచేసినా ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడగనని సిఎం జగన్మోహన్ రెడ్డి పదేపదే చెప్పారు. ఆ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏపీలో మద్యనిషేధం అమలు హామీ కూడా ఒకటి. కానీ అధికారంలోకి రాగానే మద్యపానం తగ్గించేందుకు అంటూ మద్యం ధరలు విపరీతంగా పెంచేసి జేబులు నింపుకొన్నారు. తరువాత ఏడాదిలో మద్యం ధరలు తగ్గించి జేబులు నింపుకొన్నారు. అందుకే రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఒక్క ఏడాదిలోనే రెట్టింపు అయ్యాయి.

ఇప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లిక్కర్ బాండ్స్ కూడా విడుదల చేసింది. మరి సంపూర్ణ మద్య నిషేదం హామీకి విరుద్దంగా వ్యవహరిస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన మాటకు కట్టుబడి వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంటారా?” అని సవాల్ విసిరారు.