pasupuleti balaraju - pawan kalyanఎన్నికల అనంతరం జనసేన పార్టీకి మరో దెబ్బ తగలబోతోంది. ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పార్టీని విడిచి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే ఇప్పుడు మరో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నట్టు తెలిసింది. అనారోగ్యం కారణంగా మూడు నెలలుగా మైదాన ప్రాంతానికి పరిమితమైన బాలరాజు, బుధవారం సొంత నియోజకవర్గంలోని చింతపల్లి వచ్చారు.

పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో, తన అనుచరులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే మాజీ మంత్రి వైసీపీలో చేరనున్నారని, ఆయన చేరికను ముఖ్యమంత్రి జగన్‌ కూడా స్వాగతించారనే ప్రచారం ఏజెన్సీలో విస్తృతంగా సాగుతోంది. విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ఉపయోగపడే పథకాలను జగన్‌ అమలులోకి తీసుకొచ్చారన్నారు. మద్యపాన నిషేదం చాల మంచి నిర్ణయమన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందించాల్సిన అవసరం ఉందన్నారు.

దీనితో ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే విషయం పాత్రికేయులు ఆయన వద్ద ప్రస్తావించగా కాలమే నిర్ణయిస్తుందని సమాధానం ఇచ్చారు. ఇటీవలే జరిగిన ఎన్నికలలో పాడేరు నుండి పోటీ చేసిన ఆయన కేవలం ఆరు వేల ఓట్లు తెచ్చుకున్నారు. తన డిపాజిటు కూడా తిరిగి సాధించలేకపోయారు. ఆయన కంటే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు, నోటాకు ఎక్కువ ఓట్లు రావడం విశేషం. ఎన్నికల అనంతరం ఆయన పార్టీ వేదిక మీద కనిపించలేదు.