paruchuri gopala about superstar krishna సూపర్ స్టార్ కృష్ణను తమ జన్మలో మరువలేమని, సినీ రంగంలో తమకు చేయూత నిచ్చిన మహానుభావుడని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ‘పరుచూరి పలుకులు’లో నటశేఖర కృష్ణతో తమకు ఉన్న అనుబంధాన్ని, తమను ఆయన ప్రోత్సహించిన విషయాన్ని ఈ సందర్భంగా గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

‘1980లలో కృష్ణ గారు నటించిన ‘పగబట్టిన సింహం’, ‘బంగారుభూమి’ చిత్రాలకు ఘోస్ట్ రైటర్ గా పనిచేశా. ‘బంగారుభూమి’లో కృష్ణ, శ్రీదేవి నటించిన ఓ సన్నివేశానికి నేను డైలాగ్ రాశాను. ‘పద్మా…. మనిషిని నమ్మితే మన నోట్లో ఇంత మట్టి కొడతాడు. అదే, మట్టిని నమ్మితే మన నోటికి ఇంత ముద్ద పెడుతుంది. ఆ మట్టికి నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టు’ అనేది ఆ డైలాగ్. షూటింగ్ స్పాట్ లో సీన్ ఇవ్వగానే చూసిన కృష్ణగారు ఈ డైలాగ్ ఎవరు రాశారని ప్రశ్నిస్తే, చిత్ర యూనిట్ చెప్పలేదట.

ఈ డైలాగ్ ఎవరు రాశారో చెప్పమని కృష్ణ గారు మళ్లీ అడగడంతో ‘ఉయ్యూరు లెక్చరర్’ అని వారు చెప్పారని’ గోపాలృష్ణ అన్నారు. ‘ఇతను చాలా లోతుగా వెళ్లి ఆలోచించాడని’ మెచ్చుకున్నారట. ఆ తర్వాత ఎనిమిది సినిమాలకు మాటలు రాసే అవకాశాన్ని ఆ మహానుభావుడు మాకు కల్పించాడు. అన్న ఎన్టీఆర్ గారు మాకు పరుచూరి బ్రదర్స్ అని పేరుపెట్టి ఆశీర్వదిస్తే, మాకు చేయూత నిచ్చి ఆశీర్వదించింది కృష్ణ గారు. ఆయన్ని ఈ జన్మలో మర్చిపోలేం’ అని గోపాలకృష్ణ అన్నారు.

ఇక ‘ఈనాడు’ సినిమా విషయాన్ని ప్రస్తావిస్తూ… ఈ సినిమాను రిలీజ్ రోజునే విజయవాడలో కృష్ణ గారితో కలసి చూశాం. ప్రేక్షకులకు అద్భుతంగా నచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి గుంటూరు వెళ్లాం. ‘ఈ సినిమాకు డైలాగ్స్ రాసింది వీళ్లే’ అంటూ కృష్ణ గారి సోదరుడు ఆదిశేషగిరిరావు మమ్మల్ని పరిచయం చేశారు. అంతే, ఈ సినిమాలో డైలాగ్స్ బాగున్నాయనే ఆనందంతో అక్కడున్న కృష్ణ ఫ్యాన్స్ నా బుగ్గలు కూడా కొరికేశారు. ఆ సంగతి నేను మర్చిపోలేను.

వాళ్లకు దండం పెట్టి ‘ఆగండయ్యా బాబు’ అనాల్సి వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్, డ్యూయెట్స్ లేకపోవడంతో ఎలా ఉంటుందోనని అభిమానులు వణికిపోయారు. కానీ, ఈ సినిమా నాడు చరిత్ర సృష్టించింది.. రికార్డులన్నీ తిరగరాసింది. ఎన్టీఆర్ గారు తర్వాత అంతగా మేము గౌరవించే వ్యక్తి కృష్ణ గారు’ అంటూ పరుచూరి గోపాలకృష్ణ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.