Parliament Clean Chit to chandrababu Naidu on polavaram projectతానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అంటారే..అలా అయ్యింది వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, విజయసాయి రెడ్డి పరిస్థితి. ఏదో విధంగా టీడీపీని తప్పు పట్టి, చంద్రబాబుని కోర్టు బోను ఎక్కించాలని చాలా ఆసక్తిగా ఉన్నారు ఆయన. అయితే కాలం కలిసి రావడం లేదు. నిన్న పార్లమెంట్ చంద్రబాబుని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తే అది బ్యాక్ ఫైర్ అయ్యింది.

విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఒక ప్రశ్న సంధించారు. పోలవరంలో జరిగిన అవినీతిని బయటపెట్టాలని కోరారు. ప్రాజెక్ట్‌ పనుల్లో భాగంగా గత కాంట్రాక్టర్‌కు 2,343 కోట్ల రూపాయల అదనపు చెల్లింపులు జరిగినట్టుగా తెలిసిందనీ, హైడల్ ప్రాజెక్ట్‌లో నిబంధనలకు విరుద్ధంగా 787 కోట్ల రూపాయలను నవయుగ కంపెనీకి చెల్లించినట్టుగా తమ దృష్టికి వచ్చిందనీ.. ఈ అంశాలు నిజమైతే సంబంధిత వివరాలు ఇవ్వాలనీ విజయసాయిరెడ్డి కోరారు.

జలశక్తిశాఖ మంత్రి రతన్‌లాల్‌ కఠారియా బదులిస్తూ…. ప్రాజెక్ట్‌లో 2 వేల 346 కోట్ల 85 లక్షల రూపాయలు అదనపు చెల్లింపులు జరిగాయంటూ రాష్ట్రప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తమ దృష్టికి తెచ్చిందని కేంద్రమంత్రి వివరించారు. ఇందులో హైడల్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌కు 787 కోట్ల రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లించినట్టుగా కూడా పేర్కొన్నారని ఆయన గుర్తుచేశారు.

అయితే 2019 నవంబర్ 13వ తేదీన రాష్ట్రప్రభుత్వం మరో లేఖ రాసి నిపుణుల కమిటీ అభిప్రాయం కేవలం ప్రాథమిక నిర్ధారణ మాత్రమేననీ, నిధుల విడుదలలో గానీ, వ్యయంలో గానీ ఎటువంటి నిబంధనల ఉల్లంఘింపు జరగలేదనీ పేర్కొందని చెప్పుకొచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి నిర్ణయం కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆమోదం మేరకే జరిగిందని కూడా రతన్‌లాల్‌ కఠారియా స్పష్టంచేశారు. తమ ప్రభుత్వమే చంద్రబాబు ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిందని తేలడంతో విజయ సాయిరెడ్డి సైలెంట్ అయిపోయారు.