దేనికైనా కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దులు దాటితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అది ఒక దేశపు హద్దు అయినా… విమర్శల హద్దులైనా..! ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ రణరంగం హద్దులు దాటుతున్నాయనేది రాజకీయ విశ్లేషకుల మాటలు.

అసెంబ్లీ వేదికగా జరిగిన అవమాన భారానికి కృంగిపోయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత ప్రెస్ మీట్ లో వెక్కి వెక్కి ఏడ్చారు. నాలుగు సార్లు ఏపీకి ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన ఒక సీఎం, ఒక చిన్న పిల్లాడు మాదిరి కన్నీటి పర్యంతం అవ్వడం జాతీయ మీడియాలోనే హాట్ టాపిక్ అయ్యింది.

మరోవైపు తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. నీచమైన పదానికి అర్ధం వైసీపీ పార్టీ అని, అసలు వైసీపీ విజ్ఞత కలిగిన నేతలు ఉన్నారా? లేక పనికిమాలిన నేతలు మాత్రమే ఉన్నారా? సీఎం జగన్ వెకిలి నవ్వులు సిగ్గుమాలిన చర్యగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.

సీమ బిడ్డ, పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్ అయితే మరో అడుగు ముందుకేసి తీవ్ర హెచ్చరికలు జారీ చేసారు. “మీ కన్నీటి బొట్టుకు కారణమైన ఏ ఒక్కడిని వదలము, చంద్రబాబు సార్ ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం..!” అంటూ చేసిన ట్వీట్ తెలుగుదేశం వర్గాల్లో వైరల్ అవుతోంది.