Paritala-ravi-son-paritala-Sriramతెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న పరిటాల రవి హత్య ఆరని జ్వాల వంటిది. స్థానికంగా ఎంతో మంది అభిమానులున్న పరిటాల హత్యోదంతం పార్టీ వర్గాలకు, కుటుంబ సభ్యులకు అనేక అనుమానాలను మిగిల్చింది. అయితే అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో సీబీఐ ఎంక్వయిరీ వేయడం, పరిటాల రవి కుటుంబ సభ్యులు ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి వారిపై క్లీన్ చీట్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఈ ఎంక్వయిరీపై సంతృప్తి చెందలేదని పరిటాల రవి భార్య సునీత పలు సందర్భాలలో వెల్లడించిన సంగతి రాజకీయ విజ్ఞులకు విదితమే. అయితే తన తండ్రి హత్య కొడుకు పరిటాల శ్రీరామ్ మనోభావాలు ఎలా ఉన్నాయి… అన్న విషయం తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెలుగుచూసింది.

‘తన తండ్రి హత్యను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే, తన కంటే దరిద్రమైన కొడుకు ఇంకెవరూ ఉండరని, తన తండ్రి హత్యలో న్యాయం జరగలేదని ఇప్పటికీ చెప్తున్నామని, ఆనాడూ జరిగిన పరిణామాలను పరిశీలిస్తే… గన్ మెన్లను మార్చడం, పోలీసులు వన్ సైడ్ అయిపోవడం వంటివి చూస్తుంటే… జైలులో ఉన్న వ్యక్తి ఈ పని చేసి ఉంటారా… కాస్త లాజిక్ గా ఆలోచిస్తే అర్ధమవుతుంది…’ అంటూ జర్నలిస్ట్ వేసిన ప్రశ్నకు జవాబు చెప్పారు. ఆనాడు జరిగిన సీబీఐ ఎంక్వయిరీలో లూప్ హోల్స్ ను బయటకు తీస్తున్నామని, దాని ప్రకారం న్యాయపరంగా ముందుకెళ్ళే విధంగా చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సిద్ధమవుతున్నారని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

సీబీఐ ఇచ్చిన ‘మిస్టర్ క్లీన్’ సర్టిఫికేట్ సరికాదు కాబట్టే మేము ఆరోపణలు చేస్తున్నామని, వాస్తవానికి వస్తే అవి ఆరోపణలు కాదు నిజాలని, మీడియా ముందు చర్చలు చేసే ఉదంతం ఇది కాదు అని, ఒక కేసు నడపాలంటే దానికి “సీక్రెట్ ప్లానింగ్” ఉండాలని, అది కేవలం న్యాయపరమైన ‘ప్లానింగ్’ మాత్రమేనని, చట్టవ్యతిరేకమైన ప్లానింగ్ అయితే రెండేళ్ళు చాలా ఎక్కువని, పక్కా న్యాయపరమైన ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నామని, న్యాయం జరిగే వరకు పోరాటం సాగుతుందని పరిటాల శ్రీరామ్ అభిప్రాయపడ్డారు.

పరిటాల శ్రీరామ్ చెప్పిన వ్యాఖ్యలను పరిశీలిస్తే… పరిటాల రవి హంతకులకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అవుతున్నట్లుగా కనపడుతోంది… అదేనండి న్యాయపరమైన చర్యలు తీసుకునే విధంగా… చట్టాలలో ఉన్న బొక్కలను చూసి, మరలా సీబీఐ ఎంక్వయిరీకి సిద్ధమవుతున్నట్లుగా కనపడుతోంది. అయితే ఈ ఉదంతంలో ఉన్న వారంతా ఒక్కొక్కరిగా ఇప్పటికే వివిధ సందర్భాలలో అనేక కారణాలతో మరణించిన విషయం తెలిసిందే. మరి ఇలాంటి పరిస్థితుల్లో పరిటాల కుటుంబం ఆరోపణలు చేస్తున్న వారిపై ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయా? అన్నది కాస్త ఆలోచించాల్సిన విషయమే!