YS Jagan - Mukesh-Ambaniఆంధ్రప్రదేశ్ నుండి ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాలకు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. మంత్రులు మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో పాటు పారిశ్రామికవేత్త, రాంకీ సంస్థల అధినేత అయోధ్య రామిరెడ్డి పేర్లను ఖరారు చేసింది. ఇక నాలుగో సీటును మరో పారిశ్రామిక వేత్త పరిమళ్ నత్వానికి కేటాయించారు.

మోపిదేవి, పిల్లి.. ఎమ్మెల్సీలుగా ఎన్నికై మంత్రులుగా కొనసాగుతున్నారు. మండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో వీరిద్దరికీ రాజ్యసభ అవకాశం దక్కింది. ఇక అయోధ్య రామిరెడ్డికి గతంలోనే జగన్ మాట ఇచ్చారు. దీంతో ఆ హామీని నెరవేర్చారు. ఆయన జగన్ కేసులలో ఒక ముద్దాయి కూడా. ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ కు ఆర్ధికంగా కూడా సాయపడ్డారు. దీనితో ఆయనకు జగన్ అవకాశం ఇచ్చారు.

ఈ పరిమల్ నత్వాని రిలయన్స్ గ్రూప్ ధీరుభాయ్ అంబాని ప్రాణ స్నేహితుడు. రిలయన్స్ వ్యాపార విస్తరణలో ఆయన తన ముద్ర వేశారు. ఆ పేరు తెలుగు మీడియా కూడా ఇప్పుడే రాస్తుంది కాబట్టి పెద్దగా ఎవరికి పరిచయం లేదు గాని ఆయన జాతీయ స్థాయిలో కాస్త పాపులర్ అయిన వ్యక్తే. అంబానీ స్వయంగా వచ్చి అడగడం, బీజేపీ ఒత్తిడి కూడా పనిచెయ్యడంతో ఆయనకు రాజ్యసభ ఇవ్వకతప్పలేదు.

అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదం కావొచ్చు. గతంలో తన తండ్రి చావు వెనుక రిలయన్స్ కుట్ర ఉందని జగన్ ఆరోపించారు. ఈ క్రమంలో రిలయన్స్ గ్రూప్ చెందిన వ్యక్తికి పదవి ఇవ్వడం అంటే అది రాజకీయంగా ఇబ్బందే. అయితే రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ఆ బాధను కూడా పక్కన పెట్టి పదవి ఇచ్చాం అని చెప్పుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ సిద్ధం అవుతుంది.