జయలలిత చెప్పినదల్లా చేయడం తప్ప, మరొక విషయం తెలియని పన్నీరు సెల్వం, ఆమె మరణించిన తర్వాత సీన్ లోకి వచ్చిన శశికళ వ్యాఖ్యలను కూడా తూచ తప్పకుండా పాటించారు. శశికళ ఆదేశాలతోనే సిఎం పదవికి సైతం పన్నీరు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే కధ ఇక్కడి వరకు సవ్యంగానే సాగింది. ఇక్కడే సీన్ లోకి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఎంటర్ అయ్యింది. దీంతో ప్రతి రోజు క్లైమాక్స్ ను తలపించేలా తమిళనాట పొలిటికల్ సన్నివేశాలు రక్తి కట్టించాయి.

బిజెపి రంగప్రవేశంతో పన్నీరు సెల్వం నోటికి పనోచ్చింది. ఎన్నడూ ‘ఊ’ అంటూ తల ఆడించడమే తప్ప, తలెత్తని పన్నీరు నోటి వెంట తిరుగుబాటు ఎదురయ్యింది. దీంతో అంతా అవాక్కయ్యారు. అయితే పన్నీరు వెనుక బిజెపి ఉందని రాజకీయ వర్గాల్లో బలంగా వ్యాఖ్యలు వినిపించినప్పటికీ, వీటిని ఇరువర్గాలు తోసిపుచ్చారు. అయితే ఆ తర్వాత నాటకీయ పరిణామాల నేపధ్యంలో శశికళ జైలుకు వెళ్ళడం, పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తదితర సంగతులు తెలిసినవే.

సీన్ కట్ చేస్తే… జయలలిత మరణం ద్వారా ఖాళీ అయిన ఆర్కే నగర్ ఉపఎన్నికల సమయానికి దినకరన్ రూపంలో శశికళ వర్గానికి పెద్ద షాక్ తగిలింది. దీంతో అందివచ్చిన అవకాశంతో తమిళనాడులో బిజెపి పాగా వేయడానికి సర్వం సిద్ధమైంది. అనివార్య పరిస్థితులలో పార్టీ నుండి శశికళను, దినకరన్ లను సస్పెండ్ చేయడమే కాక, పార్టీ అధ్యక్ష పదవి కావాలన్న పన్నీరు డిమాండ్ ను పళని వర్గం ఒప్పుకోక తప్పని పరిస్థితి. అయితే ముందుంది ముసళ్ళ పండగ అన్న రీతిలో పళనికి అసలు ట్విస్ట్ ఇచ్చారు పన్నీర్.

అధ్యక్ష పదవి మాత్రమే కాదు, ముఖ్యమంత్రి పీఠం కూడా తన వశం కావాలని పట్టుబట్టడంతో, మరో ప్రత్యామ్నాయం లేక పళనిస్వామి వర్గం ఒప్పుకోక తప్పలేదన్నది లేటెస్ట్ న్యూస్. అయితే ఇందులో బిజెపి పాత్ర ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? అదే మరి చావు కబురు చల్లగా చెప్పడమంటే..! ప్రస్తుతం ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్న పళనిస్వామికి కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. ఎందుకంటే… పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అన్నాడీఎంకే భాగస్వామ్యం కాబోతోంది.