TDP_balakoti_reddyఏపీలో హత్యా రాజకీయాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఆగడం లేదు. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలోని ఆలవాలలో బుదవారం రాత్రి కాల్పులు జరిగాయి. రొంపిచర్ల మండలం టిడిపి అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డి తన ఇంట్లో నిద్రిస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి జొరబడి ఆయనపై రెండు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కాల్పులలో బాలకోటిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు ఆయనని వెంటనే నర్సారావుపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేసి కడుపులో నుచి రెండు బుల్లెట్లని బయటకి తీశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

టిడిపి నేత చదలవాడ అరవిందబాబు ఈరోజు ఉదయం హాస్పిటల్‌కి వెళ్ళి బాలకోటిరెడ్డిని పరామర్శించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ,” పల్నాడులో ఇంతవరకు గన్‌ కల్చర్ లేదు. నరసారావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దీంతో ప్రవేశపెట్టారు. ఆయన అనుచరులు పెమ్మి వెంకటేశ్వర రెడ్డి, రాముడు, మరో వ్యక్తి కలిసి మా పార్టీ నాయకుడు బాలాకోటిరెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారు. జిల్లాలో కలెక్టర్, పటిష్టమైన పోలీస్ యంత్రాంగం ఉన్నప్పటికీ టిడిపి నేతలపై ఇలా హత్యాప్రయాత్నాలు జరుగుతుండటం చాలా బాధాకరం. మా పార్టీ నాయకుడిపై హత్యా ప్రయత్నం చేసినవారిని ఉపేక్షించకుండా తక్షణం అరెస్ట్ చేయాలని పోలీసులకి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.

అయితే నరసారావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఈ ఆరోపణలని ఖండించారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, “స్థానిక టిడిపి నాయకుల మద్య ఆదిపత్యపోరు సాగుతున్న విషయం అందరికీ తెలుసు. నిందితులు టిడిపికి చెందినవారే. వారిని అరెస్ట్ చేసి వారి కాల్ రికార్డ్స్ పరిశీలిస్తే బాలకోటిరెడ్డిపై ఎవరు హత్యాయత్నం చేశారో, ఎందుకు చేశారో తేలిపోతుంది,” అని అన్నారు.